హుజూరాబాద్, ఏప్రిల్ 24 : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ ఆత్మహత్య చేసుకున్నట్టు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని పేర్కొన్నారు. కార్మికుల సమస్యలు పరిషరించకుండా కాలయాపన చేయడంతోనే ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. నాడు కేసీఆర్ సర్కార్ ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వోద్యోగులుగా గుర్తిస్తూ జీవో విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ జీవోను వెంటనే అమలుచేయాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ అభివృద్ధికి ఏటా సుమారు రూ.1,500 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్మికులు ధైర్యంగా కొట్లాడాలే గానీ, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తిచేశారు. బీఆర్ఎస్ కార్మికులకు అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.