తెలంగాణ రాజకీయ యవనికపై చెలరేగిన ‘క్షుద్ర పూజల‘ రగడ కేవలం ఒక దురదృష్టకర పరిణామం మాత్రమే కాదు. ఆరోపణలు దారిమళ్లి అంధ విశ్వాసాల బురదలోకి కూరుకుపోయిన దిగ్భ్రాంతికర పరిణామం. ప్రజాస్వామ్య చర్చను మూఢనమ్మకాల స్థాయికి దిగజార్చుతున్న కాంగ్రెస్ రాజకీయ సంస్కృతికి కొలమానం. తెలంగాణలో వర్షాలు కురువకూడదని, కరువు తాండవించాలని శివమొగ్గ, తిరుచ్చిలో బీఆర్ఎస్ శాసనసభాపక్షం ఉపనేత హరీశ్‌రావు తాంత్రిక పూజలు చేయించారని, తాను క్రూర సాధనలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపణలు చేశారు. వీళ్లు సాధారణ పౌరులు కాదు, ఒక ప్రధాన రాజకీయ పార్టీలో కీలకమైన స్థానాల్లో ఉన్నవారు.
మూఢనమ్మకాల రాజకీయీకరణ అత్యంత ప్రమాదకరం. ‘క్షుద్ర పూజలతో వర్షాలు ఆగిపోతాయి,తంత్రాలతో ప్రకృతి గమనం మారిపోతుంది‘ అని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులే ప్రచారం చేస్తే అది కేవలం ఒక రాజకీయ వ్యాఖ్య కాదు, సమాజానికి ఇచ్చే అత్యంత ప్రమాదకరమైన సందేశం.
ఒక వ్యక్తి ప్రాచీన దేవాలయాలను దర్శించడాన్ని, ఆధ్యాత్మిక సంచారం చేయడాన్ని ‘క్షుద్ర పూజ‘గా ముద్రవేసి, అది వర్షాలను అడ్డుకోగలదని, కరువును కొనితేగలదని ప్రజాబాహుళ్యంలో ప్రచారం చేయడం శాస్త్రీయ చింతనకు పూర్తి విరుద్ధమైన, అత్యంత ప్రమాదకరమైన మూఢవిశ్వాసాల వ్యాప్తి. ఇది పక్కా వ్యూహాత్మక ’వ్యక్తిత్వ హననం’!
రాజకీయం అంటే గతం వైపు చూసే గుడ్డితనం కాదు. భవిష్యత్తును నిర్మించే జ్ఞాననేత్రం. అది సిద్ధాంతాల ఘర్షణ, విధానాల పోటీ, ప్రజా సంక్షేమ అన్వేషణ. అంతేకానీ, ఆ రాజకీయ మంథనం తర్కాన్ని వదిలి తంత్రాల వైపు, ఆధారాన్ని విడిచి అంధవిశ్వాసాల వైపు దారితీస్తే అది కేవలం ఒక నాయకుడిపై జరిగే దాడి కాదు.. హేతువాదాన్ని పూడ్చిపెట్టే ప్రమాదకర కుట్ర. సుదీర్ఘ ప్రజాప్రస్థానంలో, ఉద్యమ పోరాటాల నుంచి సమర్థవంతమైన పాలన వరకు కోట్లాది మంది గుండెల్లో నిలిచిన ప్రజానాయకుని గురించి క్షుద్రపూజలు, అద్భుత శక్తులు అంటూ మూఢనమ్మకాల ముద్ర వేయడం తీవ్రంగా ఖండించదగినది. ఈ ఆరోపణలు ఆ నాయకుడి నిబద్ధతను కాదు.. ఆ నిందలు వేస్తున్న రాజకీయాల మానసిక దివాలాకోరుతనాన్ని నగ్నంగా నిలబెడుతున్నాయి. విధానపరంగా పోరాడలేని రాజకీయ దారిద్య్రమే మూఢనమ్మకాల వెనుక దాక్కుంటుంది. తర్కంతో గెలువలేని చోట తంత్రాల భయాన్ని సృష్టించడం కొత్తేమీ కాదు. కానీ ఇక్కడ మరో ప్రశ్న ఉద్భవిస్తున్నది. హరీశ్‌రావు కదలికల సమాచారం తమ వద్ద ఉన్నదని అధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్తున్నారంటే, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా, ప్రతి అడుగునూ గమనించే నిఘా ఏర్పాటు చేశారా అనేది ప్రశ్న.
అత్యంత అన్యాయమైన, చారిత్రక వాస్తవాలను తలకిందులు చేసిన అంశం ఏందంటే? శివమొగ్గ జిల్లాను ‘క్షుద్ర పూజల కేంద్రం‘గా చిత్రీకరించే ప్రయత్నం. కర్ణాటక ప్రభుత్వ అధికారిక రికార్డులు, చారిత్రక ఆధారాల ప్రకారం శివమొగ్గ ప్రాచీన శైవ, వైష్ణవ, జైన సంస్కృతులకు నిలయమైన పుణ్యభూమి.
విజయనగర శిల్పకళా రీతులకు ప్రతీకలైన ఇక్కేరి అఘోరేశ్వర ఆలయం, కేళడి రామేశ్వర ఆలయం, పశ్చిమ చాళుక్యుల అపూర్వ నిర్మాణమైన బల్లిగావి కేదారేశ్వర ఆలయం, త్రిపురాంతకేశ్వర క్షేత్రం. తుంగ, భద్ర నదుల సంగమంలో వెలసిన కూడలి రామేశ్వర, నరసింహ ఆలయాలు. హోయసళుల కీర్తికి సాక్ష్యమైన భద్రావతి లక్ష్మీనరసింహ ఆలయం, శక్తి పీఠంగా విరాజిల్లుతున్న చంద్రగుట్టి రేణుకాంబ ఆలయం, సిగందూరు చౌడేశ్వరి, తలగుండ ప్రణవేశ్వర క్షేత్రాలు. లక్షలాది భక్తులు నిత్యం ఆరాధించే ఈ దివ్యధామాలను ‘క్షుద్ర పూజల భూమి‘గా ముద్రవేయడం భక్తకోటి విశ్వాసాలను తీవ్రంగా గాయపరచడమే.
ఈ మొత్తం వ్యవహారంలో అంతకంటే ఘోరమైన దృశ్యం మరోటి కనిపిస్తున్నది. హిందూధర్మ పరిరక్షణే తమ శ్వాస అని నిత్యం గళమెత్తే బీజేపీ నాయకత్వపు ముసుగు మౌనం! రాజకీయ ప్రయోజనాల కోసం శతాబ్దాల ఆధ్యాత్మిక ఘనతను, భక్తుల ఆత్మగౌరవాన్ని బలిపీఠం ఎక్కిస్తున్న వేళ నోళ్లు మెదపకపోవటం. సనాతన ధర్మాన్ని, దేవాలయాల పవిత్రతపై రాజకీయ బురద చల్లుతుంటే రాజకీయలబ్ధి కోసం అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి అవలంబించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. వర్షపాతం అనేది పూర్తిగా వాతావరణ శాస్ర్తానికి సంబంధించిన ప్రకృతి ప్రక్రియ. రుతుపవనాలు, అల్పపీడనాలు, ఎల్ నినో-లానినా ప్రభావాలు, గాలిలో తేమ వంటి అంశాలే వర్షాలను నిర్ణయిస్తాయి. ఎంతగా అంటే… శాస్త్ర సాంకేతికత పెరిగి ఉపగ్రహాలు, సూపర్ కంప్యూటర్ల ద్వారా వర్షాలను ముందే అంచనా వేస్తూ, క్లౌడ్ సీడింగ్ వంటి కృత్రిమ పద్ధతులూ వాడుతున్నాం. ఇలాంటి శాస్త్రీయ అవగాహన లేని నేతలు, ఒక నాయకుడి పూజల వల్లే రాష్ట్రంలో వర్షాభావం వచ్చిందనడం కేవలం అశాస్త్రీయమే కాదు.. ప్రజా చైతన్యాన్ని దిగజార్చే ప్రమాదకరమైన ధోరణి!
మరో వైపరీత్యం ఏందంటే? ప్రతిపక్ష నేతపై ’క్షుద్ర పూజల’ నెపం నెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వమే, స్వయంగా వర్షాల కోసం దేవాదాయశాఖ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వరుణ యాగాలు, హోమా లు నిర్వహించడమే కాక, మంత్రులు సైతం స్వయంగా వాటిలో పాల్గొన్నారు. మూఢనమ్మకాల ప్రాతిపదికన చూస్తే, కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఈ యాగాలు వానలు కురువడానికా? రేవంత్ ప్రభుత్వం కూలిపోవడానికా? అనే విడ్డూరమైన ప్రశ్న పుట్టుకొస్తున్నది. మూఢనమ్మకాల రాజకీయీకరణ అత్యంత ప్రమాదకరం. ‘క్షుద్ర పూజలతో వర్షాలు ఆగిపోతాయి, తంత్రాలతో ప్రకృతి గమనం మారిపోతుంది‘ అని బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ప్రజాప్రతినిధులే ప్రచారం చేస్తే అది కేవలం ఒక రాజకీయ వ్యాఖ్య కాదు, సమాజానికి ఇచ్చే అత్యంత ప్రమాదకరమైన సందేశం.
కాంగ్రెస్ నాయకులపై హరీశ్‌రావు ఇప్పటికే న్యాయపరంగా సవాల్ చేశారు. కానీ, ఈ వివాదం సమాజం ముందు నిలబెడుతున్న ప్రశ్న తీవ్రమైనది. తెలంగాణ నేల, ఇక్కడి రైతు కష్టం, ప్రజల శ్వాసతో తన రాజకీయ భవిష్యత్తును ముడివేసుకున్న ఒక ప్రజాప్రతినిధి తన సొంత రాష్ర్టానికి కరువు రావాలని ఎలా కోరుకుంటారు? అందులో ఏమైనా తర్కం ఉన్నదా? ఆరోపణలు చేసినవారే ఆలోచించాలి. మాటవరసకు నిజంగానే క్షుద్రపూజలు అనేవి ఉంటే, హరీశ్‌రావు వాటిని చేయించాలని అనుకుంటే ‘రెండున్నరేండ్లుగా రాష్ర్టాన్ని పట్టిపీడిస్తున్న పాలనా వైఫల్యాలు తొలగిపోవాలి, ప్రాణప్రదమైన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిన ప్రభుత్వం కూలిపోవాలి, తెలంగాణ మళ్లీ వికాస బాట పట్టాలి‘ అని ఆకాంక్షిస్తారు. అంతేకానీ వర్షాలు కురువవద్దని ఎందుకు చేయిస్తారు?
మూఢనమ్మకాల ముసుగులో జరిగే అమానుష ఆచారాలు, నరబలులు, చేతబడుల లాంటి సామాజిక రాక్షసాన్ని అంతమొందించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ర్టాలు ప్రత్యేక చట్టాలను తెచ్చాయి. మహారాష్ట్రలో డాక్టర్ నరేంద్ర దభోల్కర్ ఆత్మబలిదానం నుంచి పుట్టుకొచ్చిన 2013 చట్టం అయినా, 2017లో కర్ణాటక ప్రభుత్వం తెచ్చిన చట్టమైనా, కేరళ వేస్తున్న అడుగులైనా…సమాజంలో ’శాస్త్రీయ దృక్పథాన్ని’
రక్షించడానికే రూపుదిద్దుకున్నయి.
కానీ ప్రగతిశీల భావాలకు, పోరాటాల చైతన్యానికి మారుపేరైన తెలంగాణ నేలపై ప్రజల భయాలు, నమ్మకాలు, మూఢవిశ్వాసాల ప్రాతిపదికగా రాజకీయాలు రూపుదిద్దుకోవాలని చూడటం అత్యంత ప్రమాదకరం. శాస్త్రీయ ఆలోచనలు, హేతువాదాన్ని పెంచాల్సిన పవిత్ర వేదికల నుంచే అజ్ఞానాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలు వెలువడటం బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠ. అటువంటి రాజకీయాలు ప్రజలను చైతన్యవంతమైన పౌరులుగా చూడవు. భయాలతో ఊగిసలాడే ఒక గుంపుగా మాత్రమే మారుస్తాయి.
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు