హైదరాబాద్, ఆగస్టు 5, (నమస్తే తెలంగాణ): దక్షిణాది రాష్ర్టాల ప్రజలకు న్యాయాన్ని చేరువ చేసేందుకు హైదరాబాద్ నగరంలో సుప్రీంకోర్టు శాశ్వత ధర్మాసనాన్ని (బెంచ్‌ను) ఏర్పాటుచేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యసభలో బుధవారం ప్రవేశపెట్టిన ‘సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు- 2026’పై జరిగిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు వెల్లడించిన అనంతరం ఆయన మాట్లాడారు. తొలినాళ్ల నుంచి దక్షిణాది రాష్ర్టాల ప్రజలు ప్రతి ముఖ్యమైన కేసు కోసం ఢిల్లీకే వెళ్లాల్సి వస్తున్నదని, ఇది సాధారణ మధ్యతరగతి ప్రజలకు, రైతులు, విద్యార్థులకు ఎంతో ఖర్చుతో కూడుకున్నదని తెలిపారు. దక్షిణాదిలో శాశ్వత సుప్రీంకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని మించిన అనువైన ప్రదేశం మరొకటి లేదని వివరించారు. భౌగోళికంగా ఇది దక్షిణాది రాష్ట్రాలన్నింటికీ మధ్యలో ఉంటుందని, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ ప్రజలు ఇకడకు సులభంగా చేరుకోవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా 92 వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటి సత్వర పరిషారానికి, భారీ భారాన్ని తగ్గించేందుకు న్యాయమూర్తుల సంఖ్యను 33 నుంచి 37కు పెంచడం సరైన నిర్ణయమేననిని ఆభినందించారు. కేవలం న్యాయమూర్తుల సంఖ్యను పెంచడానికే ఈ బిల్లు పరిమితం కాకుండా, భావి న్యాయవ్యవస్థలో చారిత్మ్రాక సంసరణలు రావాలని కేంద్రాన్ని కోరారు.
జడ్జిల సంఖ్యపెంపు బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) మినహా, ప్రస్తుతమున్న 33 నుంచి 37కు పెంచేందుకు ఉద్దేశించిన ‘సుప్రీంకోర్టు(న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లు-2026ను బుధవారం రాజ్యసభ ఆమోదించింది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల మంజూరైన సంఖ్యను పెంచుతూ తెచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును తీసుకొచ్చారు. దీనిని ఎగువ సభ ఆమోదించి, లోక్‌సభకు పంపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోద ముద్రపడింది.
పెట్రోలియం స్థాయీసంఘం సమావేశంలో వద్దిరాజు
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నిర్వహించిన పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీసంఘం సమావేశానికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. స్థాయీ సంఘం చైర్మన్ సునీల్ దత్తాత్రేయ తర్కరే అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. దేశంలో ప్రస్తుతమున్న క్రూడాయిల్, సహజవాయువు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సత్వర సేలందించేందుకుగానూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాల్సిన అవసరాన్ని రవిచంద్ర నొక్కిచెప్పారు.