ఖైరతాబాద్, ఆగస్టు 5 : సిరిపురం గ్రామంలో అక్రమంగా ఏర్పాటు చేసిన స్టోన్ క్రషర్ వల్ల తీవ్ర కాలుష్యం వెలువడుతుందని, దాని నుంచి విముక్తి కల్పించాలని సిరిపురం స్టోన్ క్రషర్ బాధిత రైతుల సంఘం అధ్యక్షుడు కందుల మల్లారెడ్డి కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరితో కలిసి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సిరిపురం గ్రామంలో సంజీవరెడ్డి అనే వ్యక్తి పంట పొలాలు, జనావాసాల మధ్య స్టోన్ క్రషర్‌ను ఏర్పాటు చేశాడని, ఫలితంగా చుట్టు పక్కల గ్రామాలు, వ్యవసాయ భూములన్నీ దుమ్మూ దూళితో నిండిపోతున్నాయన్నారు. స్టోన్ క్రషర్ ఏర్పాటు సమయంలో కాలుష్యం ఉండదని, రాళ్లు ఎగిరి వ్యవసాయ భూముల్లో పడవని చెప్పారని, కానీ పరిస్థితి అందుకు భిన్నంగా మారిందన్నారు.
సుమారు రెండు కిలోమీటర్ల వరకు ధూళి, రాళ్లు వస్తున్నాయని, పెద్ద పెద్ద రాళ్లను పేల్చుతుండడంతో అవి ఎగిరి పొలాల్లో పడుతున్నాయని, దీంతో రైతులు భయబ్రాంతులకు గురై సొంత భూములకు రావడం లేదన్నారు. సుమారు 60 రైతు కుటుంబాలు, 150, 200 ఎకరాల వ్యవసాయ భూములు ప్రభావితమవుతున్నాయని తెలిపారు. ఊరిగుండా టిప్పర్ల రాకపోకలతో ఆ దుమ్ము ఇండ్లలో చేరి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయన్నారు. నిరంతరం దుమ్ము పీల్చడం వల్ల పిల్లలు, వృద్ధుల్లో ఆస్తమా, బ్రాంకైటీస్, క్షయ వంటి శ్వాసకోశ సమస్యలు వస్తున్నాయన్నారు. క్రషర్ నుంచి వెలువడే దుమ్ము పంటలపై పడడంతో సూర్యరశ్మి అందక అవి ఎండిపోతున్నాయని అన్నారు.
రాళ్ల పొడి నేలపై పడడం వల్ల క్రమంగా భూసారం కోల్పోతున్నాయన్నారు. ఫలితంగా రైతులు పంటలు దెబ్బతిని ఆర్థికంగా నష్టపోతున్నారన్నారు. కోళ్ల ఫారాలపై పడుతుండడంతో గుడ్లు, మాంసం ఉత్పత్తి తగ్గిపోతుందన్నారు. భారీ యంత్రాల శబ్దం, రాళ్ల పేలుళ్లు, రాత్రింభవళ్లు తిరిగే టిప్పర్లతో శబ్దకాలుష్యం అధికమై ప్రజలు ప్రశాంతంగా జీవించలేని పరిస్థితి నెలకొందన్నారు. సదరు క్రషర్ యజమానికి కోమటిరెడ్డి బ్రదర్స్ అండదండలు ఉండడం వల్ల పలుమార్లు జిల్లా కలెక్టర్, రామన్నపేట తహసీల్దార్, కాలుష్య నియంత్రణ మండలి, గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులకు వినతి పత్రాలు అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తక్షణమే స్టోన్ క్రషర్‌ను తొలగించాలని, లేని పక్షంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి బలుగూరు ఉపేందర్, పర్యావరణవేత్త సాయికుమార్, డి.మల్లయ్య, పద్మమ్మ, మల్లేశ్, మల్లమ్మ, శ్రీశైలం, సైదులు, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.