చింతలపాలెం, అక్టోబర్ 05: చింతలపాలెం మండలంలో జై హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న గంజాయి, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు, ర్యాలీ పోస్టర్న ఎస్సై పి. పరమేష్ ఆవిష్కరించారు. గంజాయి, డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అక్టోబర్ 7వ తేదీ బుధవారం ఉదయం 7 గంటలకు అవగాహన ర్యాలీ చేపడుతున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు.
డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని.. ఈ మత్తు పదార్ధాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు జై హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ ర్యాలీ చేపట్టనుంది. ఈ మేరకు సోమవారం ఎస్సై పి. పరమేష్ ఈ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అక్టోబర్ 7వ తేదీన ఉదయం 7 గంటలకు మొదలయ్యే గంజాయి, డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ గ్రామపంచాయతీ ఆవరణ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు, యువతతో పాటు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు.
అవగాహన ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జై హనుమాన్ స్పోర్ట్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి మోర్తాల నాగిరెడ్డి, జాతీయ కబడ్డీ క్రీడాకారుడు అజ్మీర చందు, అడ్వకేట్, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు ధరావత్ నరసింహ, కనితి ప్రశాంత్, చింతలపాలెం మండల ఎమ్మార్పీఎస్ తెలంగాణ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.