సిటీబ్యూరో, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కారు కాగితాలకే పరిమితం చేసిన ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టు ఒక్క అడుగు ముందుకు… రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. సర్కారు విధానపరమైన లోపాలు ఆ ప్రాజెక్టును ప్రశ్నార్థకంగా మారుస్తుండగా, అశాస్త్రీయ విధానాలతో చారిత్రక కట్టడాలకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. చారిత్రక, వారసత్వ నేపథ్యం కలిగిన ప్రాంతంలో మెట్రో సంస్థ రూపొందించిన ప్రణాళికలపై పలు అనుమానాలు వస్తుండగా… తాజాగా మరో న్యాయపరమైన వివాదం చుట్టు ముట్టింది. ప్రాజెక్టు ప్రారంభించిన నాటి నుంచి సుదీర్ఘకాలంగా వివాదాలు చుట్టుముట్టినా… సర్కారు పనితీరులో మార్పు రాకపోవడంతో తాజా వివాదానికి కారణమనే విమర్శలు ఉన్నాయి.
పురాతన, వారసత్వ కట్టడాల పరిరక్షణ, చార్మినార్, ఫలక్‌నుమా, అక్కన్న, మాదన్న దేవాలయాలతోపాటు, లాల్ దర్వాజా ఆలయ ప్రాంగణానికే నష్టం వాటిల్లే విధంగా అలైన్మెంట్ ఉందనే అంశంతో మరోసారి కోర్టు మెట్లెక్కింది.
ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్‌గుట్ట వరకు కాంగ్రెస్ సర్కారు ప్రతిపాదించిన 7.5కి.మీల మెట్రో మార్గంపై ప్రహాసనంగా మారింది. హైదరాబాద్ పాతబస్తీ మెట్రో నిర్మాణ పనులపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి చారిత్రక, వారసత్వ, అతిపురాతన కట్టడాలకు ప్రమాదం పొంచి ఉందని, అలైన్మెంట్ విధానాలపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. కానీ సర్కారు మాత్రం పట్టించుకోకుండా.. నిర్మాణ పనులను చేపడుతోందనీ కోర్టులో వాదన జరిగింది.
ఫేజ్-2లో ఆరో కారిడార్‌గా ప్రతిపాదించిన ప్రభుత్వం… ఈ ప్రాజెక్టులో ప్రభావితం అవుతున్న చారిత్రక, పురాతన కట్టడాల విషయంలో ఎలాంటి అసెస్మెంట్ జరగలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నోటిఫై చేసిన ప్రాంతాల్లో పురాతన కట్టడాలు ఉన్నాయని తెలిసి కూడా కూల్చివేతలు మొదలుపెట్టిందని కోర్టులో వాదించారు. అయితే తెలంగాణ వారసత్వ చట్టం-2017 పురాతన కట్టడాల చట్టం-1958 ప్రకారం సమగ్ర హెరిటేజ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నిర్వహించలేదన్నారు. చట్టబద్ధమైన అనుమతులు పొందకుండానే పనులు ఎలా జరుగుతున్నాయని నగరవాసులు, చరిత్ర, వారసత్వ కట్టడాల స్వచ్ఛంద సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.
చట్టబద్ధ అనుమతులు లేకుండానే అభివృద్ధి పేరిట చారిత్రక సంపదను నిర్వీర్యం చేయాలని కాంగ్రెస్ సర్కారు చూస్తుందనే విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపించినా… సర్కారు పట్టించుకోలేదు. ప్రారంభంలో ఏ ఒక్క వారసత్వ రక్షణ కట్టడాలకు నష్టం జరగదని చెప్పిన ప్రభుత్వం… ఆ తర్వాత 3 కట్టడాలు ప్రభావితమవుతాయని అంగీకరించినట్లు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారమే మెట్రో మార్గంలో 6 గ్రేడ్-1 కట్టడాలతోపాటు, మొత్తం 102 వారసత్వ, సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయని మెట్రో సంస్థ తెలిపింది. కానీ కూల్చివేతలతో ఇప్పటికే కొన్ని నిర్మాణాలకు నష్టం వచ్చిందనివచ్చిందని స్థానికులు చెప్పారు. హైదరాబాద్ వారసత్వ, చారిత్రక కట్టడాలను పరిరక్షించాల్సిన హైదరాబాద్ హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ సరిగ్గా ఏర్పాటు చేయలేదని, అవసరమైన ముందస్తు అనుమతులు తీసుకోలేదని ఆరోపించారు