హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పిన రైతు డిస్కమ్ కార్యకలాపాల నిర్వహణపై సర్కార్ దృష్టి సారించింది. ఆస్తులు, అప్పులు, విద్యుత్తు నెట్వర్క్, పీపీఏల కేటాయింపు, ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపునకు అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీఎస్ ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా వ్యవహరించనుండగా, ఇంధన, ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీలు, న్యాయశాఖ కార్యదర్శి, ట్రాన్స్‌కో సీఎండీలు కమిటీలో సభ్యులుగా ఉంటారు.
‘మాజీ సైనికుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి’
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మాజీ సైనికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని సైనిక సంక్షేమశాఖ డైరెక్టర్ బ్రిగేడియర్ ఎస్ఆర్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజుతో సమావేశమైన ఆయన మాజీ సైనికుల సంక్షేమం, ఉపాధి, పునరావాసం, భద్రత కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరమున్నదని చెప్పారు. స్పందించిన సీఎస్ సమగ్ర నివేదికను రూపొందించి అందజేయాలని సూచించారు. ప్రాంతీయ సైనిక సంక్షేమాధికారి నోరి శ్రీనేశ్‌కుమార్ ఉన్నారు.