హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు సుమారు రూ.30 కోట్ల నష్టం వాటిల్లుతున్నది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులు సమ్మె విరమిస్తేనే చర్చలు ఉంటాయని స్పష్టంచేశారు. డిమాండ్ల పరిషారం అనేది భారీ ఖర్చుతో కూడుకొన్నదని, దీనికి ప్రభుత్వ సహకారం అవసరమని పేరొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే కమిటీ వేసిందని, నివేదిక కోసం నాలుగు వారాల గడువు కోరిందని వివరించారు.
యూనియన్లు కోరిన 32 అంశాలతోపాటు మరిన్ని సమస్యలపై చర్చించి నివేదిక ఇచ్చేందుకు కమిటీ ఈ సమయం అడిగిందని తెలిపారు. కానీ యూనియన్లు మొండి పట్టుదలతో సమ్మెకు వెళ్లాయని చెప్పారు. ప్రస్తుతం ప్రైవేట్ బస్సులు, విధులకు హాజరవుతున్న కార్మికుల సహాయంతో 37% బస్సులు నడుపుతున్నామని, ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 32 డిమాండ్ల పరిష్కారానికి సుమారు రూ.35,000 కోట్ల మేర అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించిన తర్వాతే చర్చలు సాధ్యమని చెప్పారు.