నిజామాబాద్ రూరల్, మార్చి 22: తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉన్నదని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. తన బాధ్యతను విస్మరించి మొండి వైఖరిని అవలంబించడం సరికాదన్నారు. మంగళవారం ఆయన నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రైతాంగ శ్రేయస్సు కోసం పెట్టుబడి సాయం, రైతుబీమాతోపాటు ఉచిత కరెంట్ సరఫరా చేస్తుండటంతో రైతులు వరి సాగుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. ఈ యాసంగిలో 70 శాతం మంది రైతులు వరి వేశారని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయబోమంటూ గత ఏడాది నుంచి మొండికేస్తున్నదని మండిపడ్డారు. పంజాబ్లో రెండు సీజన్లలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అదే విధంగా తెలంగాణలో పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.