Road Accident | పరిగి, మార్చి 14 : ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడడంతో సుమారు 20 మందికి పైగా గాయాలయ్యాయి. పరిగి డిపోకు చెందిన ప్రైవేటు బస్సు(టీఎస్ 34 టీఎ 6868) శుక్రవారం రాత్రి 7.30 గంటల సమయంలో పరిగి నుంచి షాద్‌నగర్ బయలుదేరింది. పరిగి శివారు దాటిన తర్వాత బస్సు డ్రైవర్ టికెట్స్ కోసం రోడ్డు పక్కన నిలిపే ప్రయత్నం చేస్తుండగా ఇటీవల రోడ్డు నిర్మాణ సమయంలో వేసిన మట్టిలోకి బస్సు టైర్లు దిగడంతో బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. శుక్రవారం సంతరోజు కావడంతో కూరగాయలు, ఇతర కొనుగోళ్లు, అమ్మకాల కోసం పరిగి వచ్చిన వారు తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 90 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పరిగి ఎస్ఐ సంతోష్‌కుమార్, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్‌లో పరిగి ఆసుపత్రికి తరలించారు. పరిగి సర్కారు దవాఖానలో జ్యోతి, రాములమ్మ, నర్సమ్మ, రాములు, సుజాత, నందన్, మంజుల, యాదమ్మ, శ్రీనివాస్, అంజమ్మ, పార్వతమ్మ, రుక్కమ్మలతోపాటు మరికొంత మందికి చికిత్స అందించారు. వారిలో కొంతమందికి తలకు గాయాలవగా ఇతరులకు కాళ్లు, చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. కొంత మందిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇదిలావుండగా బస్సు డ్రైవర్ ప్రయాణికులతో మాట్లాడుతూ నడిపించడం వల్లనే ప్రమాదం జరిగిందని పలువురు పేర్కొంటున్నారు. ఏదేమైనా బస్సు బోల్తా ఘటనలో పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.