గద్వాల, జూన్ 29 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకొంటూ జిల్లాకు చెందిన బిడ్డల హక్కులు కాలరాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. తనకు సెక్యూరిటీ తగ్గించినా, తనను చంపడానికి కుట్రలు పన్నినా భయపడనని.. తాను నడిగడ్డ బిడ్డనని.. సీఎం తాటాకు చపుళ్లకు బెదిరేది లేదని స్పష్టంచేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు, టీజీ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్సాగర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను విలువల గల రాజకీయం చేస్తున్నట్టు తెలిపారు. తొండలు వంటి ఆ భాష తనకు రాదని రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నడిగడ్డను సస్యశ్యామలం చేయడానికి నెట్టెంపాడు, ర్యాలంపాడు, గట్టు ఎత్తిపోతల, తుమ్మిళ్ల పథకాలకు నిధులు విడుదల చేసి పనులు ప్రారంభిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జోగుళాంబ గద్వాల జిల్లాలోని ప్రాజెక్టు పనులు పడావు పెట్టారని మండిపడ్డారు.
ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేని ఇక్కడి ఎమ్మెల్యే, సీఎం.. కొత్తగా గుడ్డెందొడ్డి ఎత్తిపోతల పథకం ఎత్తు పెంచుతామని చెప్పడం ప్రజలను మరోసారి మభ్యపెట్టడమేనని పేర్కొన్నారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధితోపాటు పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులు పూర్తి చేయడానికి గద్వాల ఎమ్మెల్యే పార్టీ మారానని చెప్తున్నాడని, పార్టీ మారిన తర్వాత ఎన్ని కోట్ల నిధులు తెచ్చారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గద్వాల అభివృద్ధికి రూ.500 కోట్ల నిధులు తెస్తానని చెప్పిన సదరు ఎమ్మెల్యే.. ఇప్పటి వరకు ఎన్ని నిధులు తెచ్చాడో స్పష్టంచేయాలని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తి చేశారని, 10 శాతం పనులకు 310 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉన్నా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 30 నెలలు కావస్తున్నా మూడు ఎకరాల భూ సేకరణ చేయలేదని విమర్శించారు. ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌రెడ్డికి అవగాహన లేదని ధ్వజమెత్తారు. కర్ణాటకలో తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవ సమయంలో ముగ్గురు సీఎంలతోపాటు కేంద్ర మంత్రి నాలుగు గోడల మధ్య చర్చలు జరిపారని, అక్కడ ఏం చర్చించారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రా పాలకుల కాళ్ల దగ్గర తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తుంగభద్ర నదిపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కాంగ్రెస్ నాయకులు సంపత్‌కుమార్, గద్వాల ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని గట్టిగా నిలదీశారు. అక్రమ ప్రాజెక్టులపై ఏనాడైనా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారా? అని ఆయన ప్రశ్నించారు.