RS Praveen Kumar | కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన ఒక శని అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఒకప్పుడు గురుకులాల్లో చదవడానికి లక్షల మంది పిల్లలు పోటీపడేవారని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి అడ్మిషన్ల కోసం సెక్రటరీ ఆఫీసు ముందు అర్థరాత్రి వరకు పడిగాపులు కాసే వారని గుర్తుచేశారు. తమ పిల్లల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం, ప్రైవేట్ సంస్థలకు లక్షలాది రూపాయలు ఖర్చుచేయకుండా నాణ్యమైన విద్య పొందేవారని పేర్కొన్నారు. గత పది సంవత్సరాలలో విద్యార్థులు మంచి పౌష్టికాహారం తీసుకుంటూ అద్భుతమైన ఫలితాలు సాధించేవారని చెప్పారు. కానీ ఇప్పుడు గురుకులాల్లో ప్రతిరోజూ ఏదో ఒక సమస్య కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫుడ్ పాయిజన్ కేసులు, విద్యార్థి ఆత్మహత్యలు, పాము కాటు సంఘటనలు, ఎలుకల బెడద.. ఫలితంగా చివరి తేదిని ఎన్ని సార్లు పొడిగించినా ఐదో తరగతి దరఖాస్తులు 80 వేలు కూడా దాటలేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. ఇవన్నీ కేవలం ఒక ఏడాదిలోనే జరగడం గమనార్హమని పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో విద్యార్థుల జీవితాలు ఆగమైనయని.. భవిష్యత్తుకు భరోసా లేదని.. ఏం తినాలన్నా, ఏ అనారోగ్యం పాలవుతారోనని ఆందోళన నెలకొందని మండిపడ్డారు. ఏ సమయంలో ఏ సంఘటన జరిగి ఆత్మహత్య చేసుకుంటారోననే భయం, పిల్లలు తల్లితండ్రులలో నెలకొందని అన్నారు. ఈ దుస్థితిపై అడిగితే కేసులు పెడుతున్నారని భయం ఉందన్నారు. ఇదంతా కేవలం నిర్లక్ష్యం, వివక్ష, అనాలోచిత విధానాల వల్ల జరుగుతున్నవేనని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని గురుకులాల్లో ఇంత జరిగినా కాంగ్రెస్ కు పట్టింపులేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక్క సమీక్ష కూడా చేయలేదని.. చేసినా అది కేవలం ఫోటోల కోసమే అని అన్నారు. కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేసిన గురుకులాలను, ఆగం చేయాలనే కోరిక, పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేయాలనే దుర్మార్గపు ఆలోచన నిజం అవుతున్నదనే సంతోషం వారిలో ఉండవచ్చని మండిపడ్డారు. కానీ ఈ పేద ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టరని.. మీరు చేస్తున్న ఈ దారుణాలను మరిచిపోరని హెచ్చరించారు. పేదల వ్యతిరేక పాలన అంతమయ్యేవరకు కేసీఆర్ నాయకత్వంలో పోరాడుతామని.. తెలంగాణను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.