RSP | పోక్సో కేసులో తన పేరు ఉపయోగించి.. తన పరువుకు భంగం కలిగించారని తెలుగు మీడియా సంస్థలకు, డిజిటల్ మీడియాకు, యూట్యూబర్లకు, పలు పార్టీల హ్యాండిల్స్‌కు పలువురు నెటిజన్లకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పరువు నష్టం దావా నోటీసులు పంపించడంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. తమరి పరువు పోయిందని మా అందరిపై కోట్ల రూపాయల దావా వేశారు కదా.. నిజంగా మీకు ఇంకా పరువు మిగిలి ఉందని రుజువు చేస్తే కూలీ పని చేసైనా మీకు జరిగిన నష్టానికి పరిహారం బరాబర్ చెల్లిస్తామని తెలిపారు. కానీ మీ ‘బగ్గీ’ చిదిమేసిన ఆ నోరు లేని పేరు లేని ఆ బాలిక పరువు విలువ ఎన్ని కోట్ల రూపాయలో మీరు చెప్పగలరా అని నిలదీశారు.
కోర్టుల్లో వకీళ్లకు, మాపై సోషల్ మీడియా ప్రతిదాడికి మీరు ఖర్చు పెడుతున్న కోట్ల రూపాయలను నేడు జైల్లో ఉన్న మీ కొడుకు మానసిక చికిత్సకు ఆనాడే పెడితే ఎంత బాగుండేది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఇంత జరిగినా మీరు నిజాలను మాట్లాడిన మమ్ములనందరినీ కోర్టుల, సోషల్ మీడియా ద్వారా బెదిరిస్తున్నారంటే, మీరు, సంగప్పలు ఏప్రిల్ 23, 2026 నాడు బాధిత బాలికను, ఆమె కుటుంబాన్ని బెదిరించలేదంటే ఎవరు నమ్ముతరు? అసలు ఈ నేరం మీకు తెల్వకుండా జరిగుంటదా అని ప్రశ్నించారు. మీ సుపుత్రుడు మహేంద్ర యూనివర్సిటీ లో తోటి విద్యార్థులను చితకబాదినప్పుడు మీరు దర్జాగా వెనకేసుకొచ్చారు..ఆనాడే మీ పరువు మీరే తీసేసుకున్నారని తెలిపారు. మీ కొడుకు జీవితాన్ని మీరే నాశనం చేశారు.. సమాజానికి భారంగా తయారుచేసి వదిలారని మండిపడ్డారు. ఈ కేసులో మీరే మొదటి ముద్దాయి, సంజయ్ గారు అని అన్నారు. తరువాతనే భగీరథుడు అని తెలిపారు. యావత్తు తెలంగాణ సమాజం అభిప్రాయం ఇదే అని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తన ఉద్యోగం చేయకుండా మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు కాబట్టే మీరు ఇంకా చర్లపల్లి కావేరి బ్యారక్ బయటే ఉన్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అందుకే తెలంగాణ సమాజాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ఇంకా బెదిరిస్తున్నారని అన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు
లాలయేత్ పంచవర్షాణి దశవర్షాణి తాడయేత్
ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్ ॥
ఈ శ్లోకాన్ని మిమ్ములను పెంచి పెద్దచేసిన ‘సంఘీయులతో’ చదివించుకొని అర్థం దయచేసి చేసుకోండి. (వారు కూడా ఇప్పుడు మీరెవరో తెలియదు అంటుండ్రు 😳) అని ఎద్దేవా చేశారు. అమ్మ గారు పూర్తిగా కోలుకొని ‘మెడికవర్’ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు అని తలుస్తాను అని వ్యాఖ్యానించారు.