కాగజ్‌నగర్, అక్టోబర్ 9: కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో-9పై హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, కాంగ్రెస్, బీజేపీ కలిసి బీసీలను మోసం చేశాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన కు మ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోసిని గ్రామంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు అన్యాయమే జరిగిందని చెప్పారు.
ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలయ్యే క్రమంలో బీసీల నోటి కాడి కూడు ఆధిపత్య వర్గాలు లాకున్నాయని విమర్శించారు. రాష్ట్ర గవర్నర్ ఆరు నెలలుగా ఈ జీవోకు ఎందుకు ఆమోదం తెలుపలేదని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు బీసీ బిల్లు విషయంలో ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి అంతా తెలిసీ కోర్టులో విచారణ జరుగుతుండగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం వెనుక ఆంతర్యమిమేటని నిలదీశారు. బీసీలను ఆశ పెట్టి ఆఖరికి ఆగం చేశారని మండిపడ్డారు. కోర్టులో పిటిషన్ వేసిన వారి వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారని, వారితో ముఖ్యమంత్రే హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారని ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో రిజర్వేషన్లతోపాటు అన్నీ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42% వాటా ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.