కౌటాల, డిసెంబర్ 30 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్యూచర్ సిటీ కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేస్తూ, మున్సిపాలిటీ కార్మికులకు రూ. 1.5 కోట్ల జీతాలివ్వలేక పోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. జీతాలు చెల్లించాలంటూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మున్సిపాలిటీ కార్మికులు చేస్తున్న సమ్మె మంగళవారం తొమ్మిదోరోజుకు చేరగా, ఆయన మద్దతుగా ధర్నాలో పాల్గొని మాట్లాడారు.
మున్సిపాలిటీ కార్మికులు ధర్నా చేస్తున్నారంటే కాంగ్రెస్ పాలన ఎలా ఉందో అర్థమవుతున్నదని ఎద్దేవాచేశారు. పారిశుధ్య పనులు చేసేవారు ధర్నా చేయడంతో పట్టణంలో ఎక్కడపడితే అక్కడ చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని తెలిపారు. ఒక్క కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోనే ఈ సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఎలాంటి ఉద్యమాలు చేయడానికైనా సిద్ధమేనని స్పష్టంచేశారు.