హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ వేదికగా రూ.10 వేల కోట్ల విలువైన భారీ బాహుబలి భూ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పరిధిలోని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల్లో ఇప్పటివరకు అసలైన పట్టాదారులకు కనీస సమాచారం లేకుండానే 22 వేల ఫైళ్ల భూ బదలాయింపులు జరిగాయని, ఇదంతా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భూమాఫియా గ్యాంగ్పనేనని ఆరోపించారు. ఈ భారీ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ పొంగులేటి తక్షణమే తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భారీ భూకుంభకోణం జరిగినా సీఎం, మంత్రి ఎందుకు స్పందించడం లేదని, వారి మొత్తం కాల్ డాటాను పరిశీలించి, సీబీఐ, ఈడీ, సీఐడీ లేదా రిటైర్డ్ న్యాయమూర్తితోనైనా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగబాలు, నాయకులు దాసరి ఉష, గోపగాని రఘురాం, మంద శ్యామ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్ నినో, వర్షాభావ పరిస్థితులతో రైతులు అల్లాడుతుంటే.. ప్రభుత్వం సాఫ్ట్‌వేర్‌ను మార్చేసి గుట్టుచప్పుడు కాకుండా భూ దందాకు తెరలేపిందని మండిపడ్డారు. రూల్ 4 (ఆర్వోఆర్ ప్రకారం కొనేవారికి, అమ్మేవారికి ముందస్తు సమాచారం ఇచ్చిన తర్వాతే బదలాయింపు జరుగాలనే నిబంధనను ప్రభుత్వం తుంగలో తొకిందని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో ఎకరా రూ.20 నుంచి రూ.30 కోట్లు పలికే 100 నుంచి 200 ఎకరాల భూములను ఇలా అక్రమంగా బదలాయించారని విమర్శించారు.
సాస్ ఇన్ఫ్రాకు భూములు కట్టబెట్టారు
ఖాజాగూడ సర్వేనంబర్ 20లోని 20 గుంటల భూమితోపాటు, జూన్ 19న మరో 1.2 ఎకరాల భూమిని ‘సాస్ ఇన్ఫ్రా’ అనే కంపెనీకి అక్రమంగా కట్టబెట్టారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. జనగామలో మీసేవ కేంద్రాలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి కోట్లాది రూపాయల సామ్ జరిగిందని, దీనిని మంత్రి పొంగులేటి రూ.3.95 కోట్ల కుంభకోణమేనని తేల్చడం హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ఐసీ డాటాను మార్చడానికి మంత్రి సంతకం లేకుండా వీలుపడదని, ఈ సామ్ తాళం మంత్రి పొంగులేటి వద్దే ఉన్నదని ఆరోపించారు. బిల్డర్ల దగ్గర 30 శాతం కమీషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
సీఎంకు కోపమొస్తేనే ఏసీబీ కేసులు
చట్టం ముందు అందరూ సమానమనే ఆర్టికల్ 14, 15ను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నదని ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. చేర్యాల తహసీల్దార్ దిలీప్నాయక్ను ఏసీబీ కేసులో అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపిన అధికారులు.. ఆదాయానికి మంచి రూ.300 కోట్ల ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలు ఉన్న భీమ్‌రెడ్డిని ఎందుకు నోటీసులతో సరిపెట్టారని ప్రశ్నించారు. సీఎం బంధువు క్రషర్కు ఉచిత కరెంట్ ఇవ్వలేదనే కోపంతో విద్యుత్తు సిబ్బంది అంబేదర్ , మురళీధర్‌పై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. భుజంగరావు, రాంచందర్‌నాయక్ (పశుసంవర్ధకశాఖ డైరెక్టర్)పై ఆధారాలు లేకపోయినా ఏసీబీ కేసులు పెట్టి వేధిస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నేతలు క్రిశాంక్, బాల సుమన్‌ను చిన్న విషయాలకే జైలుకు పంపిన ప్రభుత్వం.. మరి రేవంత్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డిని, మకాన్సింగ్ను ఎందుకు జైలుకు పంపడం లేదని నిలదీశారు.
సుపారీ గ్యాంగ్‌లతో భూకబ్జాలు
బాధిత రైతులు తహసీల్దార్ల వద్దకు వెళ్తే తమకు తెలియదని కోర్టుకు పొమ్మంటున్నారని, రైతులు కోర్టుకు వెళ్లేలోపే సుపారీ గ్యాంగ్‌లు భూములను కబ్జాచేసి ఆ తర్వాత 50 శాతం కమీషన్ కోసం సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆర్ఎస్పీ ఆందోళన వ్యక్తంచేశారు. జీవో 111 భూములను వదలకుండా, కీసరలో భూ దందా కోసం నిబంధనలకు విరుద్ధంగా తహసీల్దార్ స్థాయి అధికారిని డీఆర్వో పోస్టింగ్‌లో కూర్చోబెట్టారని విమర్శించారు. రాత్రికిరాత్రే రికార్డులు సరిచేయాలని చూస్తున్న అధికారులను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ‘మీరు ఏం చేసినా దొరికిపోతారు, అక్రమ ఆదేశాలొస్తే బీఆర్ఎస్కు చెప్పండి, మేము ప్రజల ముందు ఉంచుతాం’ అని పిలుపునిచ్చారు. రైతులంతా భూ భారతి పోర్టల్‌లో భూమి వివరాలను సరిచూసుకోవాలని, భూ భారతి వల్ల నష్టపోయిన బాధితులెవరైనా ఉంటే ధైర్యంగా బీఆర్ఎస్ కార్యాలయానికి రావాలని, బాధితుల పక్షాన తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పారు.