హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఆగమాగమయ్యాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్‌కుమార్, తుంగ బాలు, అభిలాష్, వీరబాబుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలపై డీజీపీ ఆదివారం నిర్వహించిన వార్షిక సమావేశంలో వెల్లడించిన వివరాలను చూస్తే క్షీణించిన శాంతిభద్రతల పరిస్థితి అర్థమవుతున్నదని తెలిపారు. సైబర్ నేరాలు, మహిళలపై అఘాయిత్యాలు, పేదలపై ఘోరాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన నాటి నుంచి హోం మంత్రి లేకపోవడం, ఏడాదిలో ఇద్దరు డీజీపీలు మారడం దురదృష్టకరమని పేర్కొన్నారు. జగిత్యాలలో పోలీసులపై కాంగ్రెస్ నేతలు దాడులు చేశారని ఆరోపించారు. సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులపై కేసులు నమోదు చేశారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ షీటీమ్స్ పెట్టి రక్షణ కల్పిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల రక్షణను గాలికొదిలేసిందని ఆరోపించారు. తెలంగాణ పోలీసులను ప్రభుత్వం రాజకీయ కక్షలు తీర్చుకొనేందుకు వాడుకుంటున్నదని మండిపడ్డారు. ఇదేకోవలో క్రిశాంక్, కౌశిక్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్‌పై తప్పుడు కేసులు నమోదు చేసిందని దుయ్యబట్టారు. గాంధీభవన్ నుంచి వచ్చిన డైరెక్షన్ మేరకు పోలీసులు నడుచుకుంటూ చట్టాన్ని అపహాస్యం చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లె కాంగ్రెస్ పాలనలో విముక్తి ప్రాంతంగా మారిందని పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని చెప్పారు.