వెల్దండ, ఫిబ్రవరి 7 : రాష్ట్రంలోని గురుకులాలను వైకుంఠధామాలుగా మార్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి దేనని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఆర్‌ఎస్‌ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని గురుకులాలను మృత్యుకుహారాలుగా మార్చారని మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి గ్రామం లో ఉన్న బాలానగర్ గురకులం మృతురాలు విద్యార్థిని ఆరాధ్య కుటుంబాన్ని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, రాష్ట్ర ఫుడ్స్ కమిషన్ మాజీ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, మాజీ జడ్పీటీసీ విజితారెడ్డితో కలిసి ప్రవీణ్‌కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సైన్యంలోకి వెళ్తానన్న విద్యార్థిని ఆరాధ్యను కాటికి పంపిన పాపం కాంగ్రెస్ సర్కార్‌దేనని ప్రవీణ్‌కుమార్ విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు రాష్ట్రం లో 56 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందారని, దీనికి విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తు న్న సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థిని ఆరాధ్య మృతిపై అనుమానం ఉన్నదని, ఎలా? ఎందుకు? మృతి చెందిందన్న విషయాన్ని ప్రభుత్వం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకుల విద్యార్థులు ప్రాణాలు వదులుతున్నారని ధ్వజమెత్తారు. ఆరాధ్య కుటుంబానికి రూ.5 కోట్ల పరిహారం, డబుల్ బెడ్రూం ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆరాధ్య కుటుంబానికి ఆర్ఎస్పీ రూ.51 వేలు, జైపాల్‌యాదవ్ రూ.10 వేలు ఆర్థికసాయం అందజేశారు. మాజీ ఎంపీపీ రాంరెడ్డి, మాజీ జడ్పీటీసీ రాములమ్మ, బీఆర్ఎస్ నాయకులు మధుసూదన్, యాదగిరి, ఆనంద్, ప్రసాద్, శేఖర్, రమేశ్, రవి, జంగయ్య తదితరులు ఉన్నారు.