మంచిర్యాల, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘మంత్రి వివేక్‌కు దమ్ముంటే ఎన్నికల్లో గెలిచి చూపించాలే. కానీ గెలిచిన కౌన్సిలర్లను ఇంతగా హింసించడం సరికాదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి ఓ మహిళతో ఇలా ప్రవర్తించడం ఏమిటి.. ఆ వచ్చినోడికి ఇంట్లో తల్లి, చెల్లి, భార్య అందరూ ఉంటారు కదా.. మరీ ఇంత దౌర్జన్యమా? మళ్లీ ఎవరైనా వస్తే చెప్పులతో గుణపా ఠం చెప్పేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం.’ అంటూ 11వ వార్డు మహిళలు ముక్తకంఠంతో స్పష్టం చేశారు. క్యాతన్‌పల్లి 11వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ భూమయ్య గౌడ్ ఇంటిపై సింగరేణి అధికారుల దాడిని చూసిన వారంతా.. సర్కార్‌పై మర్లపడుతున్నారు. బాధిత కౌన్సిలర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు శనివారం క్యాతన్‌పల్లికి వచ్చిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్టమధు ముందే స్థానిక మహిళలు సర్కార్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఇంట్లో ఎవరూ లేనప్పుడు వచ్చి ఓ మహిళను హింసించడం కరెక్ట్ కాదు. మా మహిళా సోదరీమణులందరం భూమన్న భార్య విజయక్కకు అండగా ఉంటాం. కానీ, ఇలా చేయడం అన్యాయం. భూమయ్య గౌడ్‌ను 30 ఏండ్లసంది చూస్తున్నాం. ఆపద.. సంపదకు వస్తడని గెలిపించుకున్నాం. సింగరేణి భూమి ఒక్క మా భూమన్న ఇంటి దగ్గరే లేదు కదా.. ఈ ప్రాంతం అంతటా ఉన్నది. సింగరేణి వాళ్లు ఆ భూమంతా తీసుకుంటే.. మేమంతా దగ్గరుండి భూమన్నతో ఈ భూమి సింగరేణికి అప్పజెప్పిస్తాం. ఇంట్లో మొగోళ్లు లేనప్పుడు ఒక ఆడ మనిషిని చేసి, ఇలా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి. ఓట్లప్పుడి నుంచి కాంగ్రెసోళ్లు మాకు ఫోన్లు చేసిన వాళ్ల ఇంటికి పోవద్దని చెప్పిండ్రు.
భయం భయంగా రావాల్సి వచ్చింది. వాళ్ల ఇంటికి రాకుండా రోడ్లు తవ్వించిండ్రు.. ఇంత దారుణం చేసిండ్రు. భూమన్న ఒక్కడే కాదు.. 30 ఏండ్ల క్రితం వచ్చి ఇక్కడే గుడిసెలు వేసుకొని మేమం తా ఉంటున్నాం. ఇయ్యాల భూమన్న ఇంటికి వచ్చిండు.. రేపు మా ఇండ్ల మీదకు వస్తరు. మేం ఎందుకు వదిలిపెడతాం. అప్పుడు సర్కార్ చెప్తేనే వచ్చి గుడిసెలు వేసుకున్నాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు… లొంగమంటే లొంగుతలేడు. అందుకే ఇట్లనన్న చేసి లొంగదీసుకోవాలని చూస్తున్నరు. మా కౌన్సిలర్లను బెదిరించినా, ఏం చేసినా బీఆర్ఎస్తోనే ఉంటాం. బీఆర్ఎస్కే మేమంతా పని చేస్తాం. ఇప్పుడైనా, ఎప్పుడైనా బీఆర్ఎస్కే ఓటు వేస్తాం. మళ్లీ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్నే గెలిపించుకుంటాం.” అంటూ స్థానిక మహిళలు అల్టీమేటం ఇచ్చారు. ఇంత దారుణాలకు ఒడిగడుతున్న కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్‌కు గుణపాఠం తప్పదంటూ స్థానికులు చెబుతున్నారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ భూమయ్య భార్య విజయ మాట్లాడుతూ.. నిన్నటి నుంచి మమ్ములను ఘోరాతిఘోరంగా హింసిస్తున్నారు. సింగరేణి వాళ్లు వచ్చి దౌర్జన్యంగా టెంట్‌హౌస్ సామగ్రిని చిందరవందర చేసి పోయారు. బాల్కసుమన్ అన్న టికెట్ ఇచ్చినందుకు మేం బాల్కసుమన్ అన్న వెనుకే నిలబడుతాం. మీరు ఎంత మంది వచ్చినా, ఏం చేసినా భయపడేది లేదు. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చేది లేదు. బాల్కసుమన్ అన్నకే జై కొడతాం అంటూ ఆమె స్పష్టం చేశారు. క్యాతన్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీపై, మంత్రి వివేక్‌పై ఉన్న వ్యతిరేకతకు స్థానిక మహిళలు చేసిన ప్రకటనే నిదర్శనమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు.
రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక, కాంగ్రెస్ సర్కార్ హయాంలో అరాచకమైన పాలన సాగుతున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాంగ్రెస్‌లో చేరలేదని క్యాతన్‌పల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను వేధించడాన్ని తీవ్రంగా ఖండించారు. క్యాతన్‌పల్లి 11వ వార్డు కౌన్సిలర్ భూమయ్య గౌడ్ ఇంటిపై సింగరేణి, రెవెన్యూ అధికారులు దాడి, కౌన్సిలర్ కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసిన నేపథ్యంలో శనివారం బాధిత కుటుంబం ఇంటికి కొప్పుల ఈశ్వర్ వచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు పుట్టమధు, కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకుడు రాజిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేని శంకర్‌తో కలిసి ఆయన క్యాతన్‌పల్లికి వచ్చి పరామర్శించారు.