హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘ఏక్ పోలీస్ విధానం’ అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ ఊసే ఎత్తడం లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. తమ సెలవులను ఎందుకు తగ్గించారని ప్రశ్నించిన పాపానికి 39 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్ల ఉసురు పోసుకున్నారని దుయ్యబట్టారు. వారిని సర్వీసుల నుంచి ప్రభుత్వం డిస్మిస్ చేయడం, 10 మందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలిగించడం దుర్మార్గమని మండిపడ్డారు. బాధిత కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు బుధవారం తెలంగాణభవన్‌కు వచ్చి బీఆర్ఎస్ను ఆశ్రయించారు. ఆ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. నిరుడు అక్టోబర్ 25న స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్ల సెలవుల కోసం వారి భార్యలు ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా నిరసన తెలిపారని, ఆగ్రహించిన ప్రభుత్వం.. కానిస్టేబుళ్లను ఉద్యోగాల నుంచి తొలిగించడం దుర్మార్గమని మండిపడ్డారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు.
పోలీస్ ఉద్యోగాలిచ్చిన చరిత్ర కేసీఆర్‌ది
కేసీఆర్ హయాంలో 50,000 పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో, ఆ వివరాలు కూడా వారి దగ్గర లేవని దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కారు మాత్రం పోలీసు ఉద్యోగాలను తొలగించి, వారి కుటుంబాలను నడిరోడ్డు మీద పడేసిందని విమర్శించారు. న్యాయం కోసం పోలీసులందరూ ఒకేవిధంగా నిరసన తెలిపితే.. ఆ 10 మంది ఉద్యోగాలను ఎందుకు తొలిగించినట్టు? అని నిలదీశారు. స్పెషల్ పోలీస్ ఉద్యోగాల నుంచి తొలిగించిన వారిని, తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మైనంపల్లి తండ్రీకొడుకులపై పీడీ కేసు పెట్టాలి
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు, ఆయన కొడుకు, ఎమ్మెల్యే రోహిత్‌రావు, వారి అనుచరులపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి, జైలుకు పంపాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గుండాలను జైల్లో పెట్టడం ఖాయమని స్పష్టంచేశారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్ బుధవారం ఒక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. మైనంపల్లి తండ్రీకొడుకులు ప్రజాప్రతినిధులను బెదిరించే స్థాయికి చేరుకున్నారని మండిపడ్డారు. అయినా పోలీసులు పట్టించుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు.