కౌటాల, జూన్ 6 : కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు పోడు పట్టాలిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆ భూములను గుంజుకుంటుండని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. శుక్రవారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం ఆరెగూడ, బెజ్జూర్ మండలం పాపన్న పేట, మొగవెల్లి గ్రామస్తులతో సమావేశమై పోడు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. టైగర్ జోన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నదని చెప్పారు.
కేసీఆర్ సర్కారు పోడు పట్టాలిచ్చి ప్రభుత్వ పరంగా అన్ని పథకాలు అందిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. టైగర్ జోన్ పేరుతో వందల ఎకరాలున్న భూస్వాములను వదిలేసి పేద రైతుల భూములను లాక్కునే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులను అన్ని రకాలుగా వంచనలకు గురి చేస్తుందని, రైతులకు ఇంతటి అన్యాయం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే, ఇన్చార్జి మంత్రి స్పందించకపోవడం శోచనీయమని తెలిపారు.