హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ ) : హాస్టల్మెస్లో గొడ్డుకారం పెడుతున్నరని, నాణ్యమైన భోజనం అందించాలని ప్రశ్నిస్తే నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థిని సస్పెండ్ చేస్తారా? అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ చర్య సీఎం రేవంత్‌రెడ్డి నియంతపాలనకు నిదర్శనమని బుధవారం ఒక ప్రటకనలో ఫైరయ్యారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తెలంగాణ ఉద్యమం గురించి మీకు తెల్వకపోతే తెలుసుకోవాలని సూచించారు. వాడపల్లి నవీన్ మహాత్మాగాంధీ యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడని తెలిపారు. యూనివర్సిటీ హాస్టల్మెస్లో గొడ్డుకారం పెట్టారని ప్రశ్నిస్తే బహుమానంగా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేయడం మీ నియంతపాలనకు నిదర్శనమని విమర్శించారు. మీరు గొడ్డుకారం పెట్టింది నిజం కాదా? విద్యార్థులకు మంచి ఆహారం పెట్టాలనడం తప్పా అని ప్రశ్నించారు. మీ ప్రభుత్వ దిష్టిబొమ్మ తగులబెట్టాడా? ధర్నా చేసి నిరసన తెలిపాడా? ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం? కేవలం నవీన్ బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకుడనే కదా.. ఇలా చేశారని మండిపడ్డారు. కనీసం విద్యార్థి భవిష్యత్‌పై ఒక నిమిషం ఆలోచించరా ఆగ్రహం వ్యక్తంచేశారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించాలని హితవు పలికారు. లోపాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్త్తనంటే.. ఎంతమందిని చేస్తరో.. విద్యార్థులతో పెట్టుకొని ఎంతకాలం అధికారంలో ఉంటరో మేం కూడా చూస్తం!’ అని ఆర్ఎస్పీ హెచ్చరించారు.
రాష్ట్ర గురుకులాల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యయత్నాలపై బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. అసలు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఏం జరుగుతున్నదని, వాటిని ఏం చేద్దామనుకుంటున్నరని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. మొన్నటి బెల్లంపల్లి ర్యాగింగ్ సంఘటన మరువక ముందే మళ్లీ వికారాబాద్ కొత్తగడి సంక్షేమ పాఠశాలలో వైస్ ప్రిన్సిపల్ వేధింపులు భరించలేక మరో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఆందోళన కలిగిస్తున్నదని అన్నారు. నిరుడు ఎన్నడూ లేనంతగా ఎస్సీ గురుకులాల్లో వరుస దుర్ఘటనలు తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా బతికారని గుర్తుచేశారు. ఈ వరుస ఘటనల వెనక ఈ పిల్లలను మళ్లీ వెలివాడలకే పరిమితం చేయాలన్న కుట్రదాగి ఉన్నదేమోనని అనుమానం వ్యక్తంచేశారు. ఈ ఘటనలపై వెంటనే విచారణకు ఆదేశించాలని ఆర్ఎస్పీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.