హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, రక్షకభటులుగా ఉండాల్సిన పోలీసులు అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి చట్టాన్ని తుంగలో తొకుతున్నారని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. తెలంగాణభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగర నడిబొడ్డున ఉన్న సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఆర్వో మహేశ్ ముదిరాజ్, పీఏ మహేందర్‌రెడ్డిపై జరిగిన దాడి దేశ చరిత్రలోనే అత్యంత సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. తెలంగాణ పోలీసులకు గతంలో అద్భుతమైన ప్రతిష్ట ఉండేదని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ఆ వ్యవస్థను సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం భ్రష్టుపట్టించారని మండిపడ్డారు.
శాసనసభకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలను పోలీసులు అక్రమంగా అడ్డుకోవడమే కాకుండా హేయంగా ప్రవర్తించారని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్యేల ప్యాంట్లు లాగే స్థాయికి దిగజారడం ముమ్మాటికీ సీఎం వేసిన పకా ప్లాన్ ప్రకారమే జరిగిందని ఆరోపించారు. అకడే ఉన్న కేటీఆర్ పీఏ, పీఆర్వోలను పోలీసులు చెప్పుకోలేని భాషలో తిట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.
డీజీపీ కార్యాలయం, సీఐడీ ఆఫీస్, ఇంటెలిజెన్స్ కార్యాలయాల మధ్య ఉన్న సైఫాబాద్ పీఎస్ పరిసరాల్లో 15 మంది గుర్తుతెలియని వ్యక్తులు మాసులు ధరించి అనుమానాస్పదంగా తిరుగుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. డీజే పర్మిషన్ పేరుతో స్టేషన్ గదిలోకి చొరబడి, ‘వీళ్లే కదా పోలీసులను తిట్టింది’ అంటూ కేటీఆర్ పీఏ, పీఆర్వోలపై హత్యాయత్నానికి తెగబడ్డారని ఆరోపించారు. వారిని పట్టుకోవడంలో పోలీసులు ఎందుకు విఫలమయ్యారో డీసీపీ శిల్పవల్లి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దాడి జరిగిన అనంతరం కనీసం ఫిర్యాదు తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడానికి కూడా తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ‘దాడి జరుగలేదు కదా, కేసు ఎలా పెడతాం‘ అంటూ డీసీపీ మాట్లాడటం అత్యంత బాధాకరమని ప్రవీణ్‌కుమార్ అన్నారు. గతంలోనూ కేటీఆర్ ఇంటిపై దాడి జరిగినప్పుడు కానీ, హరీశ్‌రావుపై పెట్రోల్ పోసి నిప్పంటించాలంటూ మైనంపల్లి వ్యాఖ్యానించినప్పుడు కానీ ఎలాంటి కేసులు నమోదు చేయలేదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కేసు పెట్టినా నేటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని అన్నారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద చావుడప్పు కొట్టిన వారిపై చర్యలు తీసుకోకపోగా, రోప్ పార్టీలతో వారికి రక్షణ కల్పించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని చెప్పడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయని ప్రవీణ్‌కుమార్ పేరొన్నారు. గద్వాల జిల్లాలో ఒక దళిత యువకుడు కులాంతర వివాహం చేసుకున్నందుకు అతని ఇంటిని కూల్చివేస్తే ముఖ్యమంత్రి, మంత్రులు, చివరికి కలెక్టర్ కూడా స్పందించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నర్సుగా పనిచేస్తున్న శిరీష అనే యువతిపై లైంగికదాడి చేసి హత్య చేస్తే, హోంమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు.
పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి దాసోహమైంద ని, ఇప్పటికైనా డీజీపీ, సీపీ సజ్జనార్ స్పందించి పా రదర్శకంగా వ్యవహరించాలని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. తమ ఫిర్యాదులపై కేసులు నమోదు చేసేంతవరకు న్యాయపోరాటం ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పల్లె రవికుమార్, అరుణ, సాయితేజరావు, కల్వకుర్తి శ్రీనివాస్‌యాదవ్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
కోర్టు ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసినప్పటికీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. వినాయకచవితి పండుగ బందోబస్తులో పోలీసులు తీవ్ర బిజీగా ఉన్నప్పటికీ, కేటీఆర్ సిబ్బందిని వేధించాలనే దురుద్దేశంతోనే విచారణకు పిలిపించారని అన్నారు. తాను కూడా గతంలో ఏడేండ్లపాటు ఐపీఎస్ అధికారిగా గణేశ్ బందోబస్తు నిర్వహించానని, ఇంతటి అత్యవసర వేళల్లో తీవ్రమైన నేరాలు మినహా ఇలాంటి చిన్న కేసుల్లో ఎవరినీ స్టేషన్లకు పిలిపించరని గుర్తుచేశారు. అయినా పగబట్టినట్టు వారిని పిలిపించి, మధ్యాహ్నం వరకు ఒక పోలీసు అధికారి కూడా లేకుండా స్టేషన్ లోపల కూర్చోబెట్టారని, చివరికి కరెంటు కూడా నిలిపివేసి చీకటి గదిలో విచారించారని ఆయన దుయ్యబట్టారు. ఉగ్రవాదుల మాదిరిగా వారిని చీకటి గదిలో విచారించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు.