శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 15: ఐటీ కారిడార్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉన్న ప్రముఖ వాణిజ్య భవనం ‘మంత్రి కాస్మోస్’ ప్రాంగణంలోని కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించడం తీవ్ర కల కం రేపింది. సినీ నటుడు అల్లు అర్జున్ మామ కే చంద్రశేఖర్‌రెడ్డి సూచనలతో ఆయన అనుచరులు రౌడీలతో కలిసి ఈ అక్రమణకు యత్నించారని ఫిర్యాదు రావడంతో గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఈ నెల 13న ఉదయం 8.40 గంటల సమయంలో మురళీధర్‌రెడ్డి, గడ్డ రవి నేతృత్వంలో సుమారు 15 మంది గుర్తుతెలియని దుండగులు, రౌడీలతో కలిసి మంత్రి కాస్మోస్ భవనం నైరుతి దిశలో ఉన్న సర్వీస్ గేట్ తాళాలను పగులగొట్టి, లోపలికల అక్రమంగా ప్రవేశించారు.
అక్కడ ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేసి, తమ వెంట తెచ్చిన టిన్‌షీట్లు, ఫెన్సింగ్ ఏర్పాటుచేసి ఆ స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. దీనిని అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి, బెదిరింపులకు పాల్పడ్డారు. తమకు రాజకీయ పలుకుబడి ఉందని, చంద్రశేఖర్‌రెడ్డి చెప్పడంతోనే తాము ఈ టిన్ షీట్లు వేస్తున్నామని దుండగులు పేర్కొన్నారు. దుండగుల ఈ అక్రమ చొరబాటు, వారి దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై మంత్రి కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ మేనేజర్ రవిరెడ్డి రాజు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ పెద్దిరాజులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై గచ్చిబౌలి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) 329(3), 324(2), 351(2) రెడ్‌విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఉద్యోగుల ఆందోళన..!
మంత్రి కాస్మోస్ యాజమాన్యానికి చెందిన 1.0504 హెక్టార్ల భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు ప్రయత్నించారని బాధితులు ఆరోపించారు. ఈ క్రమంలోనే వారు భవన అత్యవసర సేవలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహారించారని, విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు, జనరేటర్లు, వ్యర్థాల నిర్వహణ షెడ్‌తోపాటు వాటర్ ట్యాంకర్లు, చెత్త వాహనాలు, అత్యవసర సమయాల్లో వినియోగించే ఫైరింజన్లు వెళ్లేందుకు కీలకమైన మార్గాన్ని బ్లాక్ చేశారని బాధితులు ఆరోపించారు. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీలలో సుమారు ఐదు వేల మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, అత్యవసర మార్గాన్ని ఆక్రమించడం వల్ల భద్రతకు ముప్పు వాటిటిల్లుతుందని ఉద్యోగులు తీవ్ర భయాందోళనలు వ్యక్తంచేస్తున్నారు.