లక్నో, సెప్టెంబర్ 15: మొబైల్ ఫోన్ ఇన్స్టాల్మెంట్ కట్టలేదని ఒక వ్యక్తిని కొందరు అపహరించడమే కాక, అతడిని దవాఖానకు తీసుకువెళ్లి బలవంతంగా అతడి శరీరంలోని రక్తాన్ని లాక్కున్న దారుణ ఘటన యూపీలో చోటుచేసుకుంది. నావల్ కుమార్ అనే వ్యక్తి ఏడాది క్రితం రూ.21,500 ఖరీదైన ఒక మొబైల్ ఫోన్‌ను జీరో డౌన్‌పేమెంట్‌తో కొన్నాడు. నెలవారీ ఇన్స్టాల్మెంట్ రూ.2,700 కట్టడంలో విఫలం కావడంతో నెల తర్వాత అతడి ఫోన్‌ను నిర్వాహకులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ మిగిలిన ఇన్స్టాల్మెంట్లు కట్టాలంటూ అతడిని వేధించేవారు. ఈ క్రమంలో ఈ నెల 8న కొందరు వ్యక్తులు వచ్చి అతడిని బెదిరించి అపహరించుకుపోయి లక్నోకు తీసుకుపోయారు. అక్కడ ఒక దవాఖానలో అతడి శరీరం నుంచి బలవంతంగా రక్తం తీయించారు.
అక్కడి నుంచి ఒక ఇంటికి తీసుకుపోయి బంధించి తీవ్రంగా కొట్టారు. దీంతో అతడు తన సోదరుడిని అడిగి ఒక వాయిదా మొత్తం చెల్లించాడు. అయినా అతడిని వదిలిపెట్టకుండా వారు ఇంకో రూ.12,500 చెల్లిస్తేనే వదిలిపెడతామంటూ కొట్టారు. దీంతో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పైనుంచి ఒత్తిడి రావడంతో నిందితులు కుమార్‌ను వదిలిపెట్టారు. దీనిపై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.