హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరికాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) పర్యటించనున్నారు. క్యాంపస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు – ప్రభుత్వ ప్రణాళిక అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచే క్యాంపస్ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. సీఎం పర్యటనను అడ్డుకుంటామని పలు విద్యార్థి సంఘాలు ప్రకటించడంతోపాటు నిరుద్యోగులు నిరసన తెలిపే అవకాశం ఉందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యూనివర్సిటీ మొత్తం ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. అడుగడుగునా కంచెలు బిగించి, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రికి విశ్వ విద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయమెందుకు? అని మండిపడ్డారు. ఈ కనీవినీ బందోబస్తు ఎందుకని, విద్యార్థులేమైనా ఉగ్రవాదులా అని నిలదీశారు.
విద్యాశాఖ మంత్రికి విశ్వ విద్యాలయం లోపలికి పోవాలంటే ఇంత భయమెందుకు? ఈ కనీవినీ బందోబస్తు ఎందుకు?
విద్యార్థులేమైనా ఉగ్రవాదులా? @revanth_anumula @BRSparty @KTRBRS #Osmania #Telangana pic.twitter.com/gf8Vio0i0r— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) August 25, 2025
కాగా, సోమవారం ఉదయం 11గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకుంటారు. రూ.80 కోట్ల వ్యయంతో నిర్మితమైన రెండు కొత్త హాస్టళ్లను ప్రారంభిస్తారు. అదేవిధంగా, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో 300 మంది విద్యార్థులకు వసతి కల్పించే మరో రెండు హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఓయూలోని టాగూర్ ఆడిటోరియంలో 1000 మందికి పైగా ప్రొఫెసర్లు, విద్యార్థుల సమక్షంలో ‘తెలంగాణ విద్యా రంగంలో రావాల్సిన మార్పులు – ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తదితరులు పాల్గొననున్నారు.