పరకాల, ఫిబ్రవరి 4 : కాంగ్రెస్, బీజేపీ నేతలు కలిసి మేడిగడ్డ బరాజ్‌ను బాంబులతో పేల్చివేశారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలోని డ్యామ్‌లను బాంబులతో పేల్చి వేసి ఇసుక మాఫియాకు అండగా ఉంటున్నారని ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో హనుమకొండ జిల్లా పరకాలలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కే వాసుదేవరెడ్డితో కలిసి బుధవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్రమ కేసులు, నోటీసుల పేరుతో ఉద్యమకారుడు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి వేధించే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్‌పై కుట్రలు చేసేందుకే హార్వర్డ్ యూనివర్సిటీలో కోర్సు పేరిట రేవంత్ విదేశాలకు వెళ్ల్లాడని దుయ్యబట్టారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం సమస్యలను పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపుతున్నదని మండిపడ్డారు. ప్రాణ త్యాగానికి సిద్ధపడి ప్రజలను ఏకతాటిపైకి తీసుకువచ్చిన కేసీఆర్‌ను అక్రమ కేసుల పేరిట విచారించడం దారుణమని అన్నారు.