హైదరాబాద్, ఏప్రిల్ 8(నమస్తే తెలంగాణ): రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పక్కా లూటీ దారే.. అధికారం ఉన్నచోటికి వెళ్లడం, ప్రభుత్వ ఆస్తులు కాజేయడంలో మేటి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ అమరుల స్తూపం సాక్షిగా పొంగులేటి అవినీతి, అక్రమాలను నిరూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఏమాత్రం చీమూనెత్తురు, దమ్మూధైర్యం ఉన్నా రెవెన్యూ రికార్డులతో చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. లేకపోతే ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
అయినా ఆయనకు బోర్డులు తిప్పేయడం.. పారిపోవ డం అలవాటేనని ఎద్దేవా చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అక్రమ వ్యవహారాలను పక్కా ఆధారాలతో బయటపెట్టిన బీఆర్ఎస్పై బురదజల్లుతున్న పొంగులేటి.. నిన్నటి ప్రెస్మీట్లో నిస్సహాయ మంత్రులను పక్కనబెట్టుకొని గజ్జికుక్కల, ఊరపందుల భాషతో తెలంగాణ పరువుతీసిండు.. మంత్రిననే సోయి మరచి రాఘవ కంపెనీ డైరెక్టర్లా మాట్లాడి అడ్డంగా దొరికిపోయిండు’ అని మండిపడ్డారు. రాఘవ కన్స్ట్రక్షన్స్, మేఘా ఇంజినీరింగ్ పేరిట రాష్ట్ర సంపదను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. ఆ రెండు కంపెనీలే తెలంగాణను నడిపిస్తున్నాయని అనుమానం వ్యక్తంచేశారు. దోపిడీలో భాగంగానే కొడంగల్ లిఫ్ట్ ప్రాజెక్టును సైతం పంచుకున్నాయని ఆర్ఎస్పీ ఆరోపించారు.
పొంగులేటి.. రాజీనామా చెయ్
నాదర్గుల్ భూ కుంభకోణం గురించి బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సంచలన విషయాలు బయటపెట్టారని, గతంలో ఈ భూములను కాపాడింది కేసీఆర్ సర్కారేనని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పష్టంచేశారు. హైకోర్టుకు వెళ్లి కొట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు. కానీ పొంగులేటి వంటి ప్రభుత్వ గద్ద కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు. కానీ నిన్నటి ప్రెస్మీట్లో అడ్డగోలు అబద్ధాలతో బుకాయించారని విమర్శించారు. పొంతన లేకుండా మాట్లాడి నాదర్గుల్ భూముల చుట్టూ ఉన్న బ్లూషీట్స్ను చూపిన ఆయన బోర్డులపై ఉన్న కంపెనీలను ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కానీ తాము ప్రజల ముందు ఆధారాలు పెడుతున్నానని చెప్పారు. ‘మొదట కోహినూర్ గ్రూపు బోర్డు వెలిసింది.. అదిపోయి మేఘా ఇంజినీరింగ్ కంపెనీ అండ్ శిల్పా ఇన్ఫ్రా వచ్చింది.. తర్వాత అదికూడా పోయి మళ్లీ కోహినూర్ డెవలప్మెంట్ గ్రూపు వచ్చింది.. చివరికి ఇవన్నీ తీసేసి రాత్రికిరాత్రి రంగులు చెరిపిన్రు’ అని ఆరోపించారు. హరీశ్‌రావు అన్ని అధారాలతో అక్రమాలు బట్టబయలు చేసిన వెంటనే కోహినూర్ ఏక్యూ స్క్వేర్ వాళ్లు ప్రెస్‌మీట్ పెట్టి నాదర్గుల్ భూములపై హక్కులు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. రక్షకుడే భక్షకుడై నాదర్గుల్ భూములను చెరబట్టాడని ఆరోపించారు. అయినా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం తప్పేనని స్పష్టంచేశారు.
కొత్వాల్‌గూడలో ‘రాఘవ’ అక్రమ మైనింగ్
కొత్వాల్‌గూడలో రాఘవ కంపెనీ అక్రమ మైనింగ్‌కు తెరతీసిందని ఆరెస్పీ మండిపడ్డారు. అక్కడి బ్లూషీట్స్పై ఎప్పటినుంచో ఉన్న రాఘన కన్స్ట్రక్షన్స్ కంపెనీ బోర్డుపై ఎందుకు కలర్ వేశారు? బీఆర్ఎస్ బృందం వస్తుందని తెలుసుకొని బోర్డును తుడిపేసింది వాస్తవం కాదా? క్రషింగ్ అనుమతులు లేవని రెవెన్యూ, పొల్యూషన్ బోర్డు అధికారులు నోటీసులు ఇవ్వలేదా? ఇక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుంటే సర్కారే అడ్డుకున్నదని సీఎం రేవంత్‌రెడ్డే అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని తెలంగాణ సమాజం చూడలేదా? అంటూ ప్రశ్నించారు.
హర్షారెడ్డి.. అర్ధరాత్రి ‘షా’ల ఇంటికెందుకు?
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి వాటాలు పంచుకుంటూ సర్కార్ సొమ్మును దిగమింగుతున్నారని ఆర్ఎస్పీ ధ్వజమెత్తారు. అందుకే పొంగులేటి 18గంటలు పనిచేస్తున్నారని అసెంబ్లీ సాక్షిగా రేవంత్‌రెడ్డి పొగిడారని గుర్తుచేశారు. వెలుగుమట్ల నుంచి వట్టినాగులపల్లి దాకా భూములు, గుట్టలు, చెరువులు కబ్జా పెడుతున్నారని ఆరోపించారు. వట్టినాగులపల్లి భూములను రాఘవ కంపెనీ అధినేత అప్పనంగా కొట్టేసేందుకు యత్నించారని దుయ్యబట్టారు. రాత్రికిరాత్రే 4ఎక్స్కవేటర్లు, 70మంది బౌన్సర్లను వెంటబెట్టుకొని అక్కడ సెక్యూరిటీ గార్డుల షెడ్లు, పేదల నివాసాలను కూల్చివేయించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పొంగులేటి కుమారుడు హర్షారెడ్డి అర్ధరాత్రి పల్లవీ షా, సతీషా ఇంటికి వెళ్లి బెదిరించింది వాస్తవం కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో సామాన్యుడు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేశామని గొప్పగా చెప్పిన రెవెన్యూ మంత్రి.. మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన హబీబ్ ఉల్లాఖాన్‌ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? ఆయనకు ప్రమోషన్ ఇవ్వకుండా బదిలీ చేయడంలోని ఆంతర్యమేమిటి? 4నెలలు దాటినా చార్జ్‌షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు? అని నిలదీశారు.
అవును ‘నమస్తే తెలంగాణ’ నాలుగు కోట్ల ప్రజల గుమస్తానే..
పొంగులేటి అక్రమాల లోగుట్టును బయటపెట్టిన ‘నమస్తే తెలంగాణ’పై అక్కసు వెళ్లగక్కడం దుర్మార్గమని ఆరెస్పీ ధ్వజమెత్తారు. రెవెన్యూ మంత్రిగా భూకబ్జాలు చేస్తూ సమాచార మంత్రిగా మీడియాను మేనేజ్ చేస్తున్నారని తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కానీ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ‘నమస్తే తెలంగాణ’ సచిత్ర ఆధారాలతో పొంగులేటి, కాంగ్రెస్ పెద్దల అక్రమాలను బట్టబయలు చేస్తున్నదని కొనియాడారు. ఆ పత్రిక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని.. ముమ్మాటికీ నాలుగుకోట్ల ప్రజల గుమస్తానేనని పేర్కొన్నారు. గజ్జికుక్కల, ఊరపందుల భాష మాట్లాడుతున్న పొంగులేటికి తగిన బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన బీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకాదని, అవసరమైతే తెలంగాణ జెన్జీలతో కలిసి హిమాయత్‌సాగర్‌లోని రెవెన్యూ మంత్రి ఇంటిని ముట్టడించాల్సి వస్తుందని ప్రవీణ్‌కుమార్ తేల్చిచెప్పారు.
రెవెన్యూ మంత్రి..! భూములు రక్షించరా?: దాసోజు శ్రవణ్
రెవెన్యూ మంత్రిగా వ్యవహరిస్తున్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నాదర్గుల్లో ప్రైవేట్ కంపెనీలు బోర్డులు పెడుతుంటే ఏం చేస్తున్నారు? గుడ్డి గుర్రం పండ్లు తోముతున్నారా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ప్రశ్నించారు. నాదర్గుల్ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని గుర్తుచేసిన ఆయన.. సర్కార్ భూములకు రక్షణగా ఉంటారా? బిల్డర్లు, బౌన్సర్లకు ఉంటారా? తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రెస్మీట్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్, రాష్ట్రనేత అభిలాష్ రంగినేని ఉన్నారు.