హైదరాబాద్, జూన్ 27(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం తన భద్రతను తగ్గించడంపై ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తానేమీ రాజకీయ లబ్ధి కోసం వచ్చిన వ్యక్తిని కాదని, 26 ఏండ్లు ఐపీఎస్ అధికారిగా దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేశానని, తనకు రాష్ట్రపతి శౌర్యపతకం కూడా వచ్చిందని గుర్తుచేశారు. తాను కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ హయాంలో ఆఫీసర్‌గా పనిచేశానని, ఏ ప్రభుత్వం కూడా తన భద్రతను తగ్గించలేదు కానీ, ఇప్పుడు కక్షపూరితంగా తన భద్రతను తగ్గించారని మండిపడ్డారు.
నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నందుకే తనపై కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధిస్తున్నదని ఆరోపించారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే తన వ్యక్తిగత భద్రతను కుదించిందని మండిపడ్డారు. తన సెక్యూరిటీని తొలగించినా, తనను బెదిరించినా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆపబోనని, ఎట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ను వీడనని స్పష్టంచేశారు.
శనివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘భూ దందాల్లో మునిగితేలుతున్న ముఖ్యమంత్రి సోదరుడికి నలుగురు గన్మెన్లు ఎందుకు? ఐపీఎస్ అధికారిగా 26 ఏండ్లు దేశానికి సేవలందించిన నాకు భద్రత కుదించడమెందుకు? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఏమైనా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరా?’ అని నిలదీశారు.
తన ప్రాణాలకు రేవంత్‌రెడ్డిదే బాధ్యతని హెచ్చరించారు. ‘నా బులెట్‌ప్రూఫ్ వాహనాన్ని కూడా సీఎంకే ఇచ్చేయండి. రేవంత్‌రెడ్డి తన కుక పిల్లలకు కూడా బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు సమకూర్చుకొన్నా నాకు అభ్యంతరం లేదు. కానీ, రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ఏమైనా తెలంగాణకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరా? ఆయనకు నలుగురు గన్మెన్లను ఎలా ఇస్తారు? నా పేరు చెప్పి నాతోపాటు రిటైరైన మరో 10 మంది దళిత, బహుజన అధికారులను ఇబ్బంది పెడుతున్నారు’ అని ఆర్ఎస్పీ ఆరోపించారు.
బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అంశంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన తప్పును తాను ఆధారాలు సహా బయటపెట్టినందుకే తనపై కక్ష పెంచుకొన్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. చివరికి తన గుండుపై కూడా సీఎం చౌకబారు కామెంట్స్ చేశారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని, టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవి ఇస్తానని ఆశ చూపారని చెప్పారు.
ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తానన్నా.. తనుకు వద్దని ముఖం మీదనే చెప్పానని తెలిపారు. రేవంత్‌రెడ్డి తనను చంపినా, చంపే ప్రయత్నం చేసినా తాను భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రజాపక్షాన నిలబడి బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను, పోరాడుతానని స్పష్టం చేశారు. తనపై ఇప్పటివరకు మూడుసార్లు హత్యాయత్నం జరిగిందని వెల్లడించారు. అనేక సందర్భాల్లో తనకు ప్రాణహాని ఉన్నందంటూ నిఘా పోలీసు అధికారులే వాట్సాప్ మెసేజ్‌లు చేశారని వివరించారు. అవి ప్రేమలేఖలు కావు, హెచ్చరికలని ఎద్దేవా చేశారు.