హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులు, ఉద్యోగుల సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు, కార్మికులకు ఏక మొత్తంలో ఒకేసారి ఎరియర్స్ చెల్లించేలా సింగరేణి సంస్థ సర్యులర్ విడుదల చేసిన నేపథ్యంలో కార్మికుల పక్షాన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సర్క్యులర్ ద్వారా దాదాపు 40 వేల ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుందని, ఒకో ఉద్యోగికి సుమారు రూ.4 లక్షల మేర ఎరియర్స్ అందుతాయని తెలిపారు. సింగరేణి సంస్థ లాభాల బోనస్ 2014లో 18% ఉండగా, 2022లో 30 శాతానికి పెంచి కార్మికులకు లాభాలను అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని చెప్పారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న కుట్రలను సీఎం కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారని గుర్తుచేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సింగరేణి సంస్థ పరిరక్షణకు, కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తుందని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.