హైదరాబాద్ : రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు పెండింగ్ బకాయిలన్నింటినీ చెల్లించామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ గ్రామ పంచాయతీలకు ట్రెజరీల ద్వారా రూ.760 కోట్లు విలువైన 1.45లక్షల చెక్కులను అందజేశామన్నారు. ఇంకా నిధుల బకాయిలు ఏమైనా మిగిల ఉంటే వెంటనే క్లియర్ చేస్తామన్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసంలో తెలంగాణ సర్పంచుల సంఘం నాయకులతో గురువారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. పెండింగ్లో ఉన్న అన్ని బిల్లులను వెంటనే చెల్లించాలని సర్పంచులు కోరగా, చెల్లించిన బిల్లులకు సంబంధించిన వివరాలను ఆధారాలతో సహా మంత్రి వారికి వివరించారు.
ఉపాధి హామీ పథకం మెటీరియల్ కంపోనెంట్ కింద కేంద్రం నుంచి రూ.1140 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. కేంద్ర విడుదల చేయాల్సిన నిధులు రాగానే సీసీరోడ్ల బకాయిలను క్లియర్ చేస్తామన్నారు. గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంగా విజయవంతంగా నిర్వహిస్తున్నారని, ఇందులో సర్పంచుల పాత్ర అమోఘమని మంత్రి ప్రశంసించారు. పల్లె ప్రగతి అనంతరం సర్పంచులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. సర్పంచులకు బీమా విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. సర్పంచుల సంక్షేమ సంఘం నాయకులు సౌదని భూమన్న యాదవ్, గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి, పాలకొండ ప్రనీల్ చందర్ మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.