హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): తొలి విడతలో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామం చొప్పున రైతుభరోసా నిధులను సోమవారం రైతుల ఖాతాల్లో జమచేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. నాలుగు పథకాలను ప్రారంభించిన పైలట్ గ్రామాల్లో రైతుభరోసా నిధులను జమ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 563 మండలాల్లోని 577 గ్రామాల్లో 4,41,911 మంది రైతులకు సంబంధించిన 9,48,333 ఎకరాల భూమికి రూ.569 కోట్లు జమచేసినట్టు వివరించారు. ఎన్నికల హామీలో భాగంగా పంట పెట్టుబడి సహాయాన్ని పెంచి రైతుభరోసా పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక రైతుకూ రైతుభరోసా అందజేస్తామని చెప్పారు.