హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లకు రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయనున్నామని, వాటిని ఆగస్టు 15 నాటికి లబ్ధిదారులకు అప్పగించనున్నామని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సచివాలయంలో శనివారం మంత్రి పొంగులేటి వరంగల్ నగరాభివృద్ధి, వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్టైల్ పార్, భద్రకాళి దేవస్థానం, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్‌రోడ్డు, రైల్వే తదితర అంశాలపై పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలు, సమస్యల పరిషారానికి హైదరాబాద్‌లోని హౌసింగ్ కార్యాలయంలో త్వరలో ఒక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేస్తామని తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ కల త్వరలో సాకారం కానున్నదని అధికారులకు తెలిపారు.