Real Estate | హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి ‘రియల్’ శాపం కొనసాగుతున్నది. హైడ్రా ప్రకంపనలు, మూసీ కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం వణుకుతున్నది. మూడు నెలలుగా తిరోగమనంలో ప్రయాణిస్తున్నది. నిరుడు అక్టోబర్‌తో పోల్చితే ఆగస్టు నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రాబడి తగ్గుతుండగా అక్టోబర్‌లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. దాదాపు రూ.400 కోట్లు తగ్గినట్టు ఆ శాఖ వర్గాలు చెప్తున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రాజెక్టు ప్రతిపాదనలు పిడుగులా పడగా రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు తెచ్చేలా ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టకపోవడంతో మార్కెట్‌కు ఉత్సాహం రావడం లేదని రియల్టర్లు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ విధానాలు, ఫోర్త్ సిటీ వంటి బూమరాంగ్ నిర్ణయాలు శాపంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాష్ట్రంలో ఇండ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల క్రయవిక్రయాలు తగ్గిపోగా, ధరల పెరుగుదల స్తంభించిపోయింది.
ఖజానాకు 35 శాతం తగ్గిన రాబడి
నిరుడు అక్టోబర్‌లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ఖజానాకు రూ.1219 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు లక్షన్నర లావాదేవీలు నమోదయ్యాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో 1.23 లక్షల లావాదేవీలు నమోదైనట్టు రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. రూ.795 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడించాయి. సెప్టెంబర్‌తో పోల్చితే దాదాపు రూ.20 కోట్లు అదనంగా వచ్చినా.. గతేడాదితో పోల్చితే మాత్రం రూ.424 కోట్ల లోటు నమోదైంది. అంటే ఖజానాకు ఆదాయం 34 శాతం పడిపోగా, లావాదేవీల సంఖ్య 18 శాతం తగ్గింది. రాష్ట్రంలో జూలై నుంచి హైడ్రా హడావుడి మొదలైంది. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ రంగం పరిస్థితి ఇలాగే ఉన్నది. మూసీ ప్రాజెక్టు కూడా తోడవడంతో క్రయవిక్రయాలు తగ్గి నేల చూపులు చూస్తున్నది. ప్రతి నెలా లావాదేవీల సంఖ్యలో 20 శాతం, ఆదాయంలో 30 శాతం మేర తగ్గుదల కనిపిస్తున్నది. ఈ ఏడాది జూలైతో పోల్చితే ఆగస్టులో రిజిస్ట్రేషన్లు 27.39 శాతం తగ్గగా, ఆదాయం ఏకంగా 30 శాతం పడిపోయింది. ఇక ఆగస్టుతో పోల్చితే సెప్టెంబర్‌కు పరిస్థితి మరింత దిగజారింది. రిజిస్ట్రేషన్లు 13 శాతం తగ్గగా ఖజానాకు రాబడి 28 శాతం తగ్గింది.
అసంబద్ధ విధానాలు.. అధికారులపై ఒత్తిళ్లు
ఖజానాకు రాబడి తగ్గుతుండటంతో ప్రభుత్వంలో అలజడి మొదలైంది. రాష్ర్టానికి ఆదాయాన్నిచ్చే శాఖల ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తరుచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదాయ వనరుల సమీకరణకు ఏకంగా సబ్ కమిటీని నియమించారు. అధికారులు ఎలాగైనా ఆదాయం పెంచాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తుండటంతో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎలా పెంచగలమని వాపోతున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ విధానాలతో మార్కెట్ డల్‌గా తయారైందని, ఇప్పుడు ప్రభుత్వమే ఆదాయం పెంచాలంటే ఎలా అని నిట్టూరుస్తున్నారు. మరోవైపు ప్రస్తుత పరిస్థితులతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. నెలలోనే పరిస్థితి దారుణంగా తయారైందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జూలైలో రూ.1531 కోట్ల ఆదాయం రాగా అక్టోబర్ నాటికి సగం పడిపోయింది. జూలైలో 2.04 లక్షల లావాదేవీలు నమోదుకాగా అక్టోబర్ నాటికి 40 శాతం తగ్గి 1.23 లక్షలకు పడిపోయాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కండ్లు తెరువాలని, రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట కల్పించేలా నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.
(ఆదాయం రూ.కోట్లలో)