Minister Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వం బీడీ కార్మికులకు, భవన నిర్మాణరంగ కార్మికులకు రూ.6లక్షల బీమాను అందిస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లాకేంద్రంలోని శ్రీనివాస టాకీసు బీఆర్టీయూ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మేడే వేడుకలకు మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద కులం కార్మికుల కలమని, మనమంతా కార్మికులమేనన్నారు. అలసిపోకుండా నిరంతరం వెలుగులను ఇచ్చేవాడు సూర్యుడని, అలసిపోకుండా ప్రపంచానికి సేవచేసే వాడు కార్మికుడన్నారు.
కార్మిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులకు కులం, మతం లేదని, కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో పని చేస్తున్నదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాల రాస్తున్నదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతున్నదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులను గుర్తించాల్సిన బాధ్యత అన్ని ప్రభుత్వాలపై ఉన్నదన్నారు. బీజేపీ పాలిత 16 రాష్ట్రాలలో బీడీలు చేసే కార్మికులను పట్టించుకోలేదని, ఆ విషయం మహిళా మంత్రి అయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తెచ్చినా పట్టించుకోలేద విమర్శించారు.
ప్రపంచానికి సూర్యుడు వెలుతురు ఇస్తే, కార్మికుడు తన చెమట చుక్కలతో పని చేసి అందరీ జీవితంలో వెలుగు నింపుతారని కొనియాడారు. కార్మిక లోకం కలిసి పని చేయాలని, సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేటలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సూపర్ స్పెషాలిటీ వెయ్యి పడకల ఆసుపత్రి రాబోతున్నదని, త్వరలోనే ఈఎస్ఐ – డిస్పెన్సరీ కార్మికులకు కోసం తీసుకురానున్నట్లు మంత్రి వెల్లడించారు. ఒకప్పుడు బతుకు దెరువు కోసం పొట్ట చేత పట్టుకుని పోయేవారని.. కానీ, ఇవాళ బతుకుదెరువు చూపే తెలంగాణగా పక్క రాష్ట్రాల కూలీలు వచ్చి ఇక్కడ పని చేసుకుని జీవనం కొనసాగిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.
Yకార్యక్రమంలో నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ సభ్యుడు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, బీఆర్ టీయూ జిల్లా అధ్యక్షుడు పిండి అరవింద్, రాష్ట్ర కార్యదర్శి మంచే నర్సింలు, ఎల్లు రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలోని రాజేంద్రనగర్ కాలనీలో కొలువు దీరిన మహా ఆంజనేయ స్వామి విగ్రహా ప్రతిష్ట ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు.