హైదరాబాద్: రాష్ట్రంలో పత్తి రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) అన్నారు. మార్కెట్లలో వందలాది మంది బ్రోకర్లతో దందా కొనసాగుతున్నదని ఆరోపించారు. కుట్రపూరితంగా కాంగ్రెస్ నేతలు పత్తి రైతులను ముంచుతున్నారని విమర్శించారు. పత్తిని సేకరించకపోవడంతో దళారులకు అమ్ముకునేలా కుట్ర చేశారని వెల్లడించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు పత్తి రైతులను కూడా వదిలిపెట్టలేదన్నారు. రూ.7500 మద్దతు ధర ఉన్న పత్తిని దళారులు రూ.5 వేలకే కొని రైతులను నిండా ముంచారని చెప్పారు.
పత్తి సేకరణలో రూ.3 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. పత్తి కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అక్టోబర్‌లోనే పత్తిని సేకరించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో పత్తి కాంటాలను ఏర్పాటు చేయలేదని విమర్శించారు. పత్తి కుంభకోణంలో కాంగ్రెస్ పెద్దల హస్తం ఉందని చెప్పారు. హైకోర్టులో పిల్ వేస్తే ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయడంలేదని వెల్లడించారు. బ్రోకర్లు, ట్రేడర్లు టీఆర్ నంబర్లతో అక్రమ ఖాతాలు సృష్టించి సీసీఐకి పత్తిని అమ్ముకున్నారని చెప్పారు. ఒక్కో క్వింటాల్‌పై రూ.2 వేల దోపిడీ జరిగిందన్నారు. కుట్రలో భాగంగానే కొనుగోళ్లను ఆలస్యంగా ప్రారంభించారన్నారు. 25 లక్షల మంది రైతుల కష్టాన్ని కాంగ్రెస్ నేతలు దోపిడీ చేశారని, సిట్టింగ్ జడ్జితో పత్తి కుంభకోణంపై దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
LIVE : BRS Leaders press meet at Telangana Bhavan.@PSRNSPT https://t.co/eUS9Od3Fn9
— BRS Party (@BRSparty) May 3, 2025