Telangana | హైదరాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేస్తున్న ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఏకంగా రూ.218 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టింది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆ ఏజెన్సీల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. మందులకు ప్రతి 3 నెలలకు రూ.125 కోట్ల చొప్పున ఏడాదికి మొత్తం రూ.500 కోట్లు, సర్జికల్‌కు రూ.46.25 కోట్ల చొప్పున రూ.185 కోట్లు విడుదల చేయాల్సి ఉన్నది. వాటిలో ప్రతినెలా రూ.50 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఏప్రిల్, మే, జూన్‌కు రూ.150 కోట్లు విడుదల చేయలేదని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. మందులకు రూ.90 కోట్లు, పీఎం అభిమ్ కింద రూ.56 కోట్లు, పీడీ అకౌంట్లలో రూ.12 కోట్లు, ఇటీవల సరఫరా చేసిన మందులకు రూ.60 కోట్లు పెండింగ్‌లో ఉన్నట్టు తెలిసింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ బిల్లులు వచ్చే ఏడాది మార్చి నాటికి కూడా క్లియర్ కానీ పరిస్థితి నెలకొన్నదని ఏజెన్సీల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
పాత బకాయిలు క్లియర్ చేస్తేనే..
పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోరుతూ వైద్యారోగ్య శాఖ మంత్రికి, కార్యదర్శికి లేఖలు రాసినా స్పందించడం లేదని, కనీసం సమీక్ష కూడా పెట్టడం లేదని ఏజెన్సీల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు కార్యదర్శిని అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వడం లేదని వాపోతున్నారు. తమకు చెల్లించాల్సిన బకాయిలపై ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పాత బకాయిలు క్లియర్ చేస్తేనే ఇకపై ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేస్తామని ప్రభుత్వానికి తేల్చి చెప్తున్నారు.