హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ) : ‘కేంద్రీకృత విధానం వల్ల అత్యంత తక్కువ ధరకు నాణ్యమైన సరుకులు అందుబాటులోకి వస్తాయి. జవాబుదారీతనం ఉంటుంది. అందుకే కేంద్రీకృత విధానాన్ని అమలు చేస్తున్నాం’ అని కాంగ్రెస్ సర్కార్ ఊదరగొడుతున్నది. కానీ ఆచరణలో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొన్నది. గురుకుల కిరాణా సామాను టెండర్లలో అత్యంత తక్కువ ధరకు కాదు, బహిరంగ మార్కెట్లో, రిటైల్ ధర కంటే అత్యంత ఎక్కువ ధరకు సరుకులు కొనుగోలు చేస్తుండటం గమనార్హం. మొత్తంగా ఫుడ్ ప్రొవిజన్‌కు సంబంధించి 93 రకాల కిరాణా, క్లీనింగ్ తదితర వస్తువులకు రూ.761 కోట్లకు టెండర్లు ఖరారు చేయగా, బహిరంగ మార్కెట్‌తో పోల్చితే దాదాపు 200 కోట్లకు పైగా అత్యధికమని తేలుతుండటం గమనార్హం. టెండర్లో ఖరారు చేసిన ధరలను చూస్తే విస్మయం గొలిపే అనేక విషయాలు వెల్లడవుతున్నాయి.
డీపీసీల స్థానంలో పీఎంయూ
రాష్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఆయా సంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉన్నది. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా, పాలు విజయ డెయిరీ ద్వారా సరఫరా అవుతాయి. ఇవి పోగా వంట తయారీకి ఫుడ్ ప్రొవిజన్‌కు సంబంధించిన కిరాణా సామగ్రి కొనుగోలు టెండర్లను ఇప్పటివరకు కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా ప్రొక్యూర్మెంట్ కమిటీ (డీపీసీ)లే ఎక్కడికక్కడ టెండర్లు నిర్వహించి, సప్లయ్ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించేవి. కానీ కాంగ్రెస్ సర్కార్ ప్రస్తుతం ఆ విధానానికి చరమగీతం పాడింది. డీపీసీల స్థానంలో సోషల్వెల్ఫేర్ సెక్రటరీ నేతృత్వంలో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంయూ)ను నిరుడు ఏర్పాటు చేసింది. గురుకులాలకు సంబంధించి అన్ని వస్తువులు, నిత్యావసరాల ధరల ఖరారు, సేకరణ, సరఫరా, టెండర్ ప్రక్రియను కేంద్రీకృత విధానంలో ఇక్కడే నిర్వహిస్తున్నది. ఏజెన్సీలను ఎంపిక చేస్తున్నది. అందులో భాగంగానే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి కిరాణా సామగ్రి సప్లయ్ కోసం కేంద్రీకృత విధానంలోనే కాంట్రాక్టర్లను ఎంపిక చేసింది. మేలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేసి జూన్ మొదటివారం వరకు బిడ్లు స్వీకరించింది.
అన్నీ అధిక ధరలకే..
ప్రభుత్వం ఫుడ్ ప్రొవిజన్‌కు సంబంధించి 93 వస్తువులను జాబితాలో పొందుపరిచింది. అందులో 27 బ్రాండెండ్ ఐటమ్స్ (ఆశీర్వాద్, ఎండీహెచ్, స్వస్తిక్, ఎవరెస్ట్, జెమిని) ఉన్నాయి. ఆయా వస్తువులు హోల్‌సేల్‌గా తక్కువ ధరకే లభ్యమవుతున్నాయి. టెండర్ సమయంలోనూ ఎమ్మార్పీ కంటే ఎంత తక్కువకు అందిస్తారా? అనేది కూడా వెల్లడించాల్సి ఉన్నది. అయితే ప్రస్తుతం ఆయా వస్తువులను ఎమ్మార్పీపై డిస్కౌంట్‌కు కాదు, ఎమ్మార్పీ ధరల కంటే అత్యధిక ధరకు ప్రభుత్వం కట్టబెట్టడం కొసమెరుపు. ఇక ఫుడ్ ప్రొవిజన్లో మరో 28 వస్తువులను (పప్పులు, ఉప్పులు) హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్ ధరల ఆధారంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఐటమ్స్ది కూదా అదే పరిస్థితి. వాస్తవంగా పప్పులు, ఉప్పులు, చక్కెర తదితర వస్తువులను హోల్‌సేల్ మార్కెట్లో, బల్క్‌గా తీసుకుంటే అత్యంత తక్కువధరకే లభిస్తున్నాయి. కానీ కాంట్రాక్టర్లు బహిరంగ మార్కెట్ కన్నా అధికంగా కోట్ చేయడం, ప్రభుత్వం అప్పగించడం గమనార్హం. నికరంగా ఫుడ్ ప్రొవిజన్లోని 93 ఐటమ్స్‌కు సంబంధించి రూ.761.33 కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, అం దులో రూ.200 కోట్లకుపైగా సర్కార్ ఏజెన్సీలకు దోచిపెడుతున్నదని స్పష్టమవుతున్నది. గురుకుల ఉపాధ్యాయ సంఘాలు, తెలంగాణ చిన్నతరహా కాంట్రాక్టర్లు సైతం ఆయా వస్తువుల రేట్లను చూసి నివ్వెరపోతున్నారు.
సన్‌ఫ్లవర్ కంటే పామాయిల్ ధర ఎక్కువ!
సాధారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ఎక్కువగా ఉంటుంది. ఇది గృహావసరాలకు ఉపయోగిస్తుంటారు. ఇక పామాయిల్ ధర చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువగా హోటళ్లు, ఆహారవ్యాపారంలో వినియోగిస్తుంటారు. కానీ సర్కార్ టెండర్లలో అందుకు విరుద్ధమైన రేట్లను గమనించవచ్చు. సన్‌ఫ్లవర్ రేటు కన్నా పామాయిల్ ధరను ఎక్కువగా నిర్ణయించడం గమనార్హం. కపాడియా సేల్స్ పాయింట్ వద్ద విజయ సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ ధర రూ.165.20 లభ్యమవుతుండగా, అందుకు విరుద్ధంగా ఏకంగా రూ.218.79కి కొనుగోలు చేస్తుండటం గమనార్హం. ఇక విజయ పామాయిల్ లీటర్ రూ.144.80 కాగా, సన్‌ఫ్లవర్ అయిల్ కంటే కూడా ఎక్కువగా రూ.288.12 ధర నిర్ణయించడం గమనార్హం. మైదా పిండి బహిరంగ మార్కెట్లో హోల్‌సేల్‌గా కొంటే రూ.40 కంటే తక్కువగానే లభ్యమవుతుండగా, సర్కార్ మాత్రం గోధుమపిండి ధరతో సమానంగా రూ.69కి కొనుగోలు చేస్తున్నది. ఫుడ్ప్రొవిజన్కు సంబంధించి వస్తువులను సర్కార్ కొనుగోలు చేస్తున్న ధరలు హోల్‌సేల్ కాదు కదా, రిటైల్ ధరల కంటే కూడా ఎక్కువగా ఉండటం గమనార్హం. కేవలం దోచుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం కేంద్రీకృత విధానానికి తెరతీసిందని తేటతెల్లమైంది.

