హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హస్తం ఉన్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. టెండర్లలో పాల్గొన్న నలుగురు బిడ్డర్లు క్వింటాల్ ధాన్యానికి రూ.2,007 చొప్పున ధర నిర్ణయించి, మిల్లర్ల నుంచి రూ.2,230 చొప్పున దండుకున్నారని విమర్శించారు. ధాన్యాన్ని తరలించకుండా సొమ్ముచేసుకున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ పార్టీ 232 మంది మిల్లర్ల ఖాతాల వివరాలు, పూర్తి ఆధారాలు సహా హైకోర్టులో పిల్ దాఖలు చేసిందని చెప్పారు. ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టే హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయడంలేదని దుయ్యబట్టారు. ఆదివారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ధాన్యం టెండర్ల కుంభకోణంపై విజిలెన్స్ కమిషన్, ఏసీబీకి ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. 35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వానికి రూ.7,500 కోట్లు చేరాల్సి ఉండగా, కనీసం సగం కూడా జమకాలేదని ఆరోపించారు. దీనిపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాసినా పట్టించుకోవడంలేదని విమర్శించారు.
ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్ల అక్రమాలకు తెరలేపిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్ రూ.10 కోట్ల చొప్పున అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ముడుపులు ముట్టజెప్పారని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. మిగిలిన మొత్తంలో తలాకొంత పంచుకొని కొంతమేర ఢిల్లీకి మూటలు పంపారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధిష్ఠానం దూతలకు కూడా ఇది తెలుసని పేర్కొన్నారు. అందుకే తాము ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా మౌనవ్రతం పాటిస్తున్నదని ధ్వజమెత్తారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావుపై కమిషన్లు, విచారణల పేరిట వేధిస్తున్న ప్రభుత్వం.. దాన్యం టెండర్లలో అవినీతిపై ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ ఎలాంటి తప్పుచేయలేదు కాబట్టే విచారణకు సహకరించారని, మరీ తప్పుచేయకుంటే ప్రభుత్వం కోర్టు నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
బిడ్డర్ల ఫైల్‌ను క్యాబినెట్ సమావేశంలో ఆమోదించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని, ఒకవేళ ఆమోదిస్తే ఈ కుంభకోణంలో మంత్రులందరూ భాగస్వాములవుతారని పెద్ది సుదర్శన్‌రెడ్డి హెచ్చరించారు. బిడ్డర్లు మిల్లర్ల నుంచి నగదు వసూలు చేయడం తప్ప ధాన్యాన్ని తరలించలేదని విమర్శించారు. ఇప్పుడు వారిని కాపాడేందుకే ప్రభుత్వం ధాన్యాన్ని ఫిలిైఫ్పెన్స్కు పంపుతున్నట్టు ప్రకటించిందని పేర్కొన్నారు. వెంటనే బిడ్డర్లు పౌరసరఫరాల శాఖ ఖాతాల్లోకి రూ.1,100 కోట్లు జమ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కేటీఆర్ విదేశాల నుంచి తిరిగొచ్చిన తర్వాత సివిల్ సప్లయ్ ఆఫీసు ఎదుట ధర్నా చేస్తామని చెప్పారు.
ధాన్యం టెండర్లలో భారీ అక్రమాలు జరిగినా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడంలేదని పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రశ్నించారు. మోదీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఈడీ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, బోనస్, రైతుభరోసా ఎగవేతపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. ఓట్ల కోసం ఊర్లకొచ్చే కాంగ్రెస్ నేతలను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, సభ్యుడు కిశోర్‌గౌడ్, అభిలాష్‌రెడ్డి, మహిళా నేత సుశీలారెడ్డి పాల్గొన్నారు.