హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)/హైదరాబాద్ సిటీబ్యూరో: గ్రూప్-1 అభ్యర్థులకు బాసటగా నిలిచిన విద్యార్థి నేతలు, నిరుద్యోగ విద్యార్థులపై పోలీసులు జులం ప్రదర్శించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేసి నిర్బంధం విధించారు. హైదరాబాద్ సుం దరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ఎవరినీ రానీయకుండా ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగించారు. మొత్తంగా ఎమర్జెన్సీ పాలనను తలపించారు. గూప్-్ర1 విద్యార్థుల భవిష్యత్తు, హైకోర్టు తీర్పు, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణపై సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాలని అన్ని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమావేశానికి గ్రూప్-1 పరీక్ష రాసిన అభ్యర్థులంతా హాజరు కావాలని కోరారు. ఈ నేపథ్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు విద్యార్థులు తరలివచ్చారు. అక్కడ భారీగా మోహరించిన పోలీసు బలగాలు బయట నుంచే సమావేశం లేదని, వెనక్కి వెళ్లాలని హుకుం జారీచేశారు. సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకున్నామని చెప్పినా పోలీసులు ససేమిరా అన్నారు. ఇక్కడి నుంచి వెళ్తారా? అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు పంపించాలా? అంటూ పోలీసులు బెదిరింపులకు దిగారు. కొంతమంది విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఈడ్చుకెళ్లి వ్యాన్‌లో పడేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్వీ నేతలపై పోలీసులు భౌతికదాడులకు దిగారు. బీఆర్ఎస్వీ నాయకుడు స్వామియాదవ్పై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చిక్కడపల్లి సీఐ రాజునాయక్ తీరు తీవ్ర అభ్యంతకరంగా ఉన్నదని నాయకులు మండిపడ్డారు.
విద్యార్థుల హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్: గెల్లు శ్రీనివాస్
విద్యార్థుల హక్కులను కాంగ్రెస్ సర్కార్ కాలరాస్తున్నదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గ్రూప్-1 విద్యార్థులకు మద్దతుగా సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వచ్చిన గెల్లు శ్రీనివాస్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తననెందుకు అడ్డుకుంటున్నారని పోలీసులను ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో సమస్యలపై సమావేశాలు నిర్వహించుకునే హక్కు లేదా? అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్-1 అభ్యర్థులతో సమావేశం నిర్వహిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నించారు. శ్రీనివాస్‌తోపాటు పలువురు బీఆర్ఎస్వీ నేతలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇది ప్రజాపాలన కాదు.. పోలీస్ పాలన : ఏనుగుల రాకేశ్‌రెడ్డి
రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలన కాదని, పో లీస్ పాలని అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి విమర్శించారు. విద్యార్థి సంఘాల ఆహ్వానం మేరకు రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు రాకేశ్‌రెడ్డి రావడంతో ఆయననూ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమావేశంలో పాల్గొనడానికి వస్తే అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. రాహుల్‌గాంధీ రాజ్యాంగం పట్టుకని తిరుగుతూ రాజ్యమేలుతానంటుంటే, తెలంగాణలో రేవంత్‌రెడ్డి మాత్రం అదే రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు.గ్రూప్-1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
విద్యార్థులను విడుదల చేయాలి : వాసుదేవరెడ్డి
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లగా పో లీసులు అరెస్టు చేసిన విద్యార్థులను, విద్యార్థి నేతలను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత కేతిరెడ్డి వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులకు రౌండ్‌టేబుల్ పెట్టుకుని గ్రూప్-1 అక్రమాలపై మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా? అని ఆయన ప్రశ్నించారు. ధర్నా చేశారా? రాస్తారోకో చేశారా? అని నిలదీశారు. ఇచ్చిన హామీలను మరిచి, వారి జీవితాలతో ఆడుకునే హక్కు ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో నిరంకుశ పాలన: తుంగ బాలు..
రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు ఆరోపించారు. గ్రూప్-1పై హైకోర్టు తీర్పుపై చర్చించేందుకు రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తుంటే, కావాలనే నాయకులను, విద్యార్థులను అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఒకవేళ గ్రూప్-1లో అక్రమాలు జరగకుంటే ప్రశాంతంగా కొనసాగుతున్న రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఎందుకు భగ్నం చేసినట్టు, ఎందుకు విద్యార్థులను అరెస్టు చేసినట్టు అని ప్రశ్నించారు.
పోలీస్ చర్య అప్రజాస్వామికం ; బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు
గ్రూప్-1పై చర్చించేందుకు అనుమతితో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ మీటింగ్‌ను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు. రౌడీ రా జ్యంలా విద్యార్థులపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య హకులను కాలరాసే ఈ ప్రభుత్వ ఆగడాలను ప్రజల ముందు ఉంచుతామని హెచ్చరించారు. తెలంగాణ భవన్లో మంగళవారం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, బీఆర్ఎస్ నాయకులు కురువ విజయ్‌కుమార్, బొమ్మెర రామమూర్తి, కట్ల స్వామియాదవ్, రాజుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో టీజీపీఎస్సీ చైర్మన్‌తో రివ్యూలు చేస్తూ డిఫాక్టో చైర్మన్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇప్ప టికైనా తీరుమార్చుకోవాలన్నారు.