Anganwadi Centers | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వాటిలో చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలకు కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లాలోని ఓ అంగన్వాడీ కేంద్రంలో గుడ్లపై అనుమానం వచ్చి పగలగొట్టి చూడటంతో ఓ గుడ్డు నుంచి కోడి పిల్ల బయటకు వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన కోడిగుడ్లను సరఫరా చేయాల్సిన అధికారులు.. కాసులకు కక్కుర్తిపడి కుళ్లిన గుడ్లను సరఫరా చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం శ్రావణ మాసం కొనసాగుతుండటంతో చికెన్‌తోపాటు గుడ్లకు డిమాండ్ తగ్గిపోయింది.
దీంతో చాలా గుడ్లు పౌల్ట్రీల్లోనే మురిగిపోతున్నాయి. ఇలాంటి కోడిగుడ్లను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసి, సొమ్ము చేసుకోవాలని చూస్తున్న కొందరు అధికారులు కన్సల్టెంట్లతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. కుళ్లిన కోడిగుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో కన్సల్టెంట్లు అసలు గుడ్లనే సరఫరా చేయడం లేదని, వాటిని మధ్యలోనే దళారులు మింగేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కోడిగుడ్లను సరఫరా చేయకముందే ఐసీడీసీ అధికారులకు బిల్లులు పెడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 35,700 అంగన్ వాడీ కేంద్రాలు పని చేస్తున్నాయి. వాటిలో 4,57,643 మంది గర్భిణులు, 10,44,562 మంది బాలింతలు, 6,67,783 మంది చిన్నారులు ఉన్నుట్టు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.
గురువారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్లగొండ శివారులోని రైతు వేదిక మైదానంలో మందుబాబులు తాగిపడేసిన బీర్ టిన్‌లో పాము దూరడానికి యత్నించింది. అందులో తల ఇరుక్కుపోయి బయటికి రాలేక తల్లడిల్లింది. మూడు గంటలపాటు అటూ ఇటూ తిరిగింది. స్థానికులు దానిని తీసే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. చివరకు పాము ముళ్లకంపలో నుంచి వెళ్తుండగా టిన్ ఊడిపోవడంతో బతుకుజీవుడా అంటూ వెళ్లిపోయింది.