హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు రోడ్ల అభివృద్ధిలో ఘోరంగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏడాదిన్నరలో ప్రభుత్వం రూ. 6,445 కోట్లతో 1806 కిలో మీటర్ల రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. కానీ రూ.86 కోట్లతో 51 కిలో మీటర్ల రోడ్లను మాత్రమే నిర్మించింది. అంటే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సగటున నెలకు 2 కిలోమీటర్ల రోడ్డు మాత్రమే నిర్మించింది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అలసత్వానికి ఈ లెక్కలే నిదర్శనమని విపక్షాల నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని రోడ్ల అభివృద్ధిని నాటి సమైక్య పాలకులు పట్టించుకోలేదు. కానీ ప్రత్యేక రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో రహదారుల రూపురేఖలు మార్చింది. గ్రామం నుంచి మండలాలు, జిల్లా కేంద్రాలు, హైదరాబాద్ వరకు నెట్‌వర్క్‌ను విస్తరించింది. రాష్ట్రంలో 6000 కిలోమీటర్లుగా ఉన్న డబుల్‌లేన్ రోడ్లను 12,000 కిలోమీటర్లకు, 600 కిలోమీటర్లుగా ఉన్న నాలుగు లేన్ల రోడ్లను 1100 కిలోమీటర్లకు పెంచింది. గ్రామీణరోడ్లను కూడా అభివృద్ధి చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోడ్ల నిర్మాణం నత్తకంటే నెమెదిగా నడుస్తున్నది.
కేసీఆర్ హయాంలో ఏటా వేసవిలో రోడ్ల పునరుద్ధరణ పనులు పూర్తిచేసి.. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టారు. కానీ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో రోడ్లపై గుంతలు పూడ్చడం, ప్యాచ్‌వర్క్‌లు చేయడాన్ని కూడా సర్కారు పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉందని అధికారులు చేతులెత్తేస్తున్నారు. రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులెత్తేస్తుంటే.. బిల్లులు ఎప్పుడిస్తరో తెలియక.. ప్రభుత్వ పనుల జోలికి పోవడంలేదని కాంట్రాక్టర్లు చెప్తున్నారు.