Road Network | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రోడ్ నెట్‌వర్క్‌లో తెలంగాణ ఎంతో ప్రగతి సాధించింది. రాష్ట్రంలో రోడ్ల డెన్సిటీ ప్రతి 100 చ.కి.మీలకు 99.29 కిలోమీటర్లు ఉండడమే అందుకు నిదర్శనం. ఈ రహదారుల్లో గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిర్మించిన రహదారులే ఎక్కువగా కావడం విశేషం. జాతీయ రహదారుల సగటు డెన్సిటీ 4.41 శాతం మాత్రమే.
ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక, ఆర్థిక సర్వే వివరాల ప్రకారం.. ప్రస్తుతం తెలంగాణలో రోడ్ డెన్సిటీ(సాంద్రత) సగటున ప్రతి చదరపు కిలోమీటర్‌కు 99.29 కిలోమీటర్లుగా ఉంది. హైదరాబాద్‌లో ఇది ఇంకా ఎక్కువ. మహానగరంలో ప్రతి 100 చ.కి.మీ.ల వైశాల్యానికి 1,332.85 కిలోమీటర్లుగా ఉంది. మేడ్చల్ మల్కాజిగిరిలో 385.43 కిలోమీటర్లు, రంగారెడ్డిలో 158.36 కిలోమీటర్లు, అతి తక్కువగా ములుగులో 41.25 కిలోమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 61.01 కిలోమీటర్లుగా ఉంది. రాష్ట్రంలో జాతీయ రహదారుల డెన్సిటీ ప్రతి 100 చ.కి.మీల వైశాల్యానికి కేవలం 4.45 కిలోమీటర్లు ఉండగా, జాతీయ సగటు 4.41 కిలోమీటర్లుగా ఉంది. తెలంగాణలో రోడ్ల డెన్సిటీ ఎంతో మెరుగ్గా ఉన్నట్టు దీనిబట్టి స్పష్టమవుతున్నది. తెలంగాణ ఏర్పాటయ్యాక పదేండ్ల పాటు బీఆర్ఎస్ సర్కారు అత్యధికంగా రోడ్లను నిర్మించడంతోనే ఈ ఘనత సాధ్యమైంది.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో రహదారుల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్న విషయం విదితమే. జాతీయ రహదారులు కూడా చాలా తకువగా ఉండేవి. రోడ్లన్నీ గుంతలమయమే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ రహదారులను పెద్దయెత్తున నిర్మించింది. గ్రామాల్లోని రోడ్లతోపాటు మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లే రహదారులను అభివృద్ధి చేసింది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతోపాటు వాటిని జాతీయ, రాష్ట్ర రహదారులతో అనుసంధానం చేసింది. ముఖ్యంగా గ్రామాల్లో పెద్దయెత్తున సీసీ రోడ్లను నిర్మించింది. ఫలితంగా రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జీహెచ్ఎంసీ తదితర శాఖల పరిధిలో అన్నిరకాల రహదారులు కలుపుకొని మొత్తం రోడ్ నెట్వర్క్ 1,11,730 కిలోమీటర్లకు చేరుకున్నది. ఇందులో సగానికిపైగా బ్లాక్‌టాప్ రోడ్లు ఉండగా, మిగిలినవి సీసీ, మెటల్ రోడ్లు.
ఆర్అండ్బీ రోడ్లు 29,240.28 (26.16%)
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ (పీఆర్ఈడీ, గ్రామీణ రోడ్లు) 68,539.27 (61.32%)
జీహెచ్ఎంసీ రోడ్లు 9,013.01 (8.06 %)
జాతీయ రహదారులు 4,983 (4.46%)
మొత్తం – 1,11,730.56