హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ) : రాజధాని హైదరాబాద్ పరిధిలోని ఓ పోలీస్ కమిషనర్‌పై అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టడానికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధమైనట్టు సమాచారం. హైదరాబాద్‌లోని ఒక భూవివాదంలో పోలీసు కమిషనర్ తలదూర్చడమే కాకుండా, ఆ ఎమ్మెల్యేతో అమర్యాదగా మాట్లాడారని విశ్వసనీయవర్గాల సమాచారం. దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెంది ప్రివిలేజ్ మోషన్ కోసం అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు పంపినట్టు తెలిసింది. ఆయనకు మద్దతుగా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నిలబడినట్టు చర్చ జరుగుతున్నది. ఈ వివాదం ప్రభుత్వ పెద్దల వద్దకు చేరిందని, ఇదే జరిగితే పరువు పోతుందని వారు భయపడినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యేలను బుజ్జగించే బాధ్యత ఇద్దరు మంత్రులకు అప్పగించారని తెలుస్తున్నది. వారి ప్రయత్నాలు విఫలం కావడంతో ‘బదిలీ’ వేటు వేస్తామన్న కీలక మంత్రి హామీ మేరకు కాస్త మెత్తబడ్డట్టు అసెంబ్లీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్ మెట్టుగూడలోని 733సర్వే నెంబర్లో 5,717 గజాల స్థలం వివాదంలో ఉన్నది. దీని విలువ రూ.50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ భూమి మీద ఏపీకి చెందిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కన్నేసినట్టు తెలిసింది. ఆయన ఏపీకి చెందిన ఒక ప్రముఖ విద్యాసంస్థల యజమానితో కలిసి ముంబైకి చెందిన మెహతా అనే వ్యక్తి కుటుంబ సభ్యులను రంగంలోకి దించినట్టు సమాచారం. వారి ద్వారా 2024 నవంబర్‌లో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఇదే భూమిలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఒక వ్యక్తి 60 ఏండ్ల నుంచి కబ్జాలో ఉన్నట్టు సమాచారం. వారి అడ్డు తొలగించుకునేందుకు ఏపీ పొలిటికల్ స్ట్రాటజిస్ట్.. 30 మందితో కలిసి ఆ భూమిలో నివసిస్తున్న వారిపై దాడి చేయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహబూబ్‌నగర్‌కు చెందిన ఆ బాధితుడు అదే జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యేను ఆశ్రయించినట్టు తెలిసింది. మరోవైపు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ తన పలుకుబడి ఉపయోగించి.. నేరుగా ఓ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయించినట్టు సమాచారం.
ఈ కేసును సెటిల్ చేయాలంటూ.. ఓ జోన్ బాధ్యతలు నిర్వర్తించే ఐపీఎస్ అధికారిని సీపీ ఆదేశించినట్టు తెలిసింది. దీంతో బాధితులను తన వద్దకు పిలిపించి.. సెటిల్మెంట్ కోసం ప్రయత్నించారని, ఈ క్రమంలో వారిని బెదిరించారని ప్రచారం జరుగుతున్నది. దీంతో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే కల్పించుకొని ఆ ఐపీఎస్ అధికారి తీరును తప్పుపట్టినట్టు తెలిసింది. అక్కడితో ఆగకుండా నేరుగా పోలిస్ కమిషనర్‌ను కలిసి.. కోర్టులు పరిష్కరించాల్సిన సివిల్ వివాదాల్లో మీరెందుకు తల దూర్చుతున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. ఏపీకి చెందిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌కు ఎలా కొమ్ముకాస్తారని, తెలంగాణ ఎటు పోతున్నదని నిలదీసినట్టు తెలుస్తున్నది. వెంటనే సదరు పోలిస్ కమిషనర్ తీవ్రంగా, అనుచితంగా స్పందించారని సమాచారం. ఏకవచనంతో, అమర్యాదగా మాట్లాడినట్టు తెలిసింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. దీంతో సీపీ తీరుపై ఎమ్మెల్యే తీవ్ర మనస్తాపం చెంది, ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిసింది.
శనివారం నుంచి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగానే నోటీసులు ఇవ్వాలని ఎమ్మెల్యే భావించినట్టు సమాచారం. ఆయనకు మద్దతుగా మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు నిలబడినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అందరూ కలిసి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ విషయం ప్రభుత్వ పెద్దల దగ్గరికి చేరిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను బుజ్జగించాలని ఇద్దరు మంత్రులను ఆదేశించినట్టు తెలిసింది. సదరు పోలీస్ కమిషనర్‌ను పిలిపించి క్షమాపణ చెప్పిస్తామని, నోటీసులు వెనక్కి తీసుకోవాలని మంత్రులు విజ్ఞప్తి చేయగా, ఎమ్మెల్యేలు తిరస్కరించినట్టు తెలిసింది. దీంతో నంబర్ టూ అని చెప్పుకునే మంత్రి రంగంలోకి దిగారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. శనివారం మధ్యాహ్నం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సదరు మంత్రి బాధిత ఎమ్మెల్యేను, మరో ఎమ్మెల్యేను పిలిపించి మాట్లాడినట్టు తెలిసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, సదరు పోలీస్ కమిషనర్‌ను పిలిపించి క్షమాపణ చెప్పిస్తామని, వీలు చూసుకొని అతనిపై బదిలీ వేటు వేస్తామని హామీ ఇచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. దీంతో ఎమ్మెల్యేలు కొంత మొత్తబడ్డారని, ఆదివారం చర్చించుకొని నిర్ణయం చెప్తామని అన్నట్టు తెలిసింది. చర్యలు తీసుకోకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేలే తిరగబడే పరిస్థితి వస్తుందని, ఒకవేళ పోలీస్ కమిషనర్‌ను పిలిపించి క్షమాపణ చెప్పిస్తే.. అటు అధికారుల్లో ప్రభుత్వపెద్దలపై వ్యతిరేకత పెరిగే ప్రమాదమున్నదని కాంగ్రెస్ ముఖ్యనేతలు ఆందోళన చెందుతున్నారట.