సంగారెడ్డి, జూన్ 6(నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లా కంది మండలం చేర్యాల్లో ఇండస్ట్రియల్ పార్కు భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకు ఏండ్ల తరబడి సమయం తీసుకునే రెవెన్యూ అధికారులు.. చేర్యాల్ భూసేకరణ విషయంలో మాత్రం తక్షణమే రంగంలోకి దిగారు. చేర్యాల్ ఇండస్ట్రియల్ పార్కు కోసం 120.16 ఎకరాల భూసేకరణకు గురువారం ఉదయం సంగారెడ్డి కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చారో లేదో సాయంత్రం కంది తహసీల్దార్ అసైన్డ్ భూముల రైతులతో సమావేశం అయ్యారు.
ఇండస్ట్రియల్ పార్కుకు అవసరమైన భూములను వెంటనే అప్పగించాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు నష్ట పరిహారం ఇస్తామని, లేదంటే బలవంతంగా భూములు లాక్కోవాల్సి వస్తుందని తహసీల్దార్ రైతులను హెచ్చరించినట్లు సమాచారం. సోమవారం 741 సర్వే నంబర్లోని అసైన్డ్ భూములు వద్దకు వస్తామని, అక్కడే భూములు కొలిచి స్వాధీనం చేసుకుంటామని తెలుపగా.. రైతులు తహసీల్దార్ వ్యవహారశైలిని తప్పుబట్టడంతోపాటు బెదిరింపులకు తలొగ్గమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఎకరాకు రూ.5 నుంచి రూ.7 కోట్లు చెల్లించాలని, ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అప్పుడే భూములు ఇస్తామని రైతులు చెప్పినట్టు తెలుస్తున్నది. రైతులతో సమావేశంపై కంది తహసీల్దార్ రవికుమార్‌ను వివరణ కోరగా.. చేర్యాల్లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు అవసరమైన 120.16 ఎకరాల భూమి సేకరణ ప్రక్రియ ప్రారంభించినట్టు తెలిపారు.