Telangana | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ అంచనాలకు గండి కొడుతూ ఇటు మద్యం ద్వారా వచ్చే రాబడి, అటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం భారీగా పడిపోయింది. రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.22.5 వేల కోట్ల ఆదాయం పొందాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా ఆ దరిదాపుల్లో కూడా రాబడి రాలేదని అధికారులు చెప్తున్నారు. కరోనా కాలంలో తప్ప రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో క్షీణత నమోదు కావడం ఇదే తొలిసారని కమర్షియల్ ట్యాక్స్ అధికారులు చెప్తున్నారు. వాస్తవ రాబడిని లెక్కలోకి తీసుకోకుండా ప్రభుత్వం రూ.3.5 లక్షల కోట్లతో భారీ బడ్జెట్ను రూపొందిస్తున్నట్టు తెలిసింది.
లక్ష్యానికి సుదూరంలో రాబడి
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో పక్షం రోజులు మాత్రమే ఉండగా రిజిస్ట్రేషన్ల శాఖ రూ.10,313 కోట్లు మాత్రమే ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయానికి రూ.18,229 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఐదు శాతం అదనపు ఆదాయంతో రూ.22,750 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రిజిస్ట్రేషన్ల ఆదాయం భారీగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ రాయితీలను ప్రకటించారు. అయినప్పటికీ నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటికి సగం కూడా రాబడి రాలేదు. 2023-24తో పోల్చితే గత పది నెలల్లో రాష్ట్ర రాబడులు 30 శాతం పడిపోగా, ఆర్థిక పురోగతి ఉండాల్సిన ఈ రెండు నెలల్లో రాబడి తిరోగమనంలో సాగిందని ఆ శాఖ అధికారులు పేరొన్నారు. 2023-24లో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 14.52 లక్షల దస్తావేజులు రిజిస్టర్ కాగా 2024-25లో ఇదే కాలంలో 12.16 లక్షలు మాత్రమే అమ్ముడు పోయినట్టు ఆ శాఖ అధికారి ఒకరు ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధికి వివరించారు.
రియల్ పతనం వల్లనే
రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోవటం వల్లనే రిజిస్ట్రేషన్ల రాబడిలో క్షీణత నమోదైందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది హైడ్రా, మూసీ వెంబడి కూల్చివేతలు, అవినీతి ఆరోపణలు వంటి కారణాలతో రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్ధత నెలకొన్నదని, ఆదాయం తగ్గుదలకు అదే కారణమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రిజిస్ట్రేషన్ల శాఖలో అసంబద్ధ బదిలీలు, కూడా ప్రభావం చూపినట్టు ఆ శాఖ అధికారులు చెప్తున్నారు.
తగ్గిన లిక్కర్ విక్రయాలు..
రాష్ట్ర బడ్జెట్లో 20% వరకు ఆదాయాన్ని మద్యం విక్రయాల ద్వారానే రాబట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ ఏడాది దాదాపు రూ.60 వేల కోట్లు టార్గెట్గా పెట్టుకున్నట్టు సమాచారం. ఇందుకోసం ధరల పెంపు, కొత్త కంపెనీలకు అనుమతి, ప్రపంచస్థాయి మద్యం బ్రాండ్లకు అనుమతి వంటి నిర్ణయాలు తీసుకున్నారు. బీర్ల ధరలు పెరిగితే అదే రీతిలో ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ ఈ ఏడాది మద్యం విక్రయాలు పడిపోయాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎక్సైజ్ శాఖకు రూ.35 వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.55 వేల కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల బీర్ల ధరలు పెరిగిన నేపథ్యంలో రూ.5 వేల కోట్లు అదనంగా వస్తాయ ని అంచనా వేశారు. కానీ గత ఆర్థిక ఏడాది రాబడితో పోలిస్తే రూ. 2500 కోట్లు తకువగా వచ్చినట్టు ఎక్సైజ్ నివేదికలు చెప్తున్నాయి. ఎక్సైజ్ శాఖ లెకల ప్రకారం.. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో రూ.9,438 కోట్ల మద్యం విక్రయాలు జరుగగా, నిరుడు రూ.10,542 కోట్ల అమ్మకాలు జరిగాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో దీని ప్రభావం ఇతర శాఖపై పడుతుందని ఎక్సైజ్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.