మహబూబ్‌నగర్, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమై రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం నాయినోనిపల్లి గ్రామ శివారులో ఇటీవల అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను మంగళవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చి ఉంటే రైతులకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. రైతులకు రుణమాఫీ అయిందని అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రులు క్షేత్రస్థాయిలోకి వస్తే వాస్తవాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే మరో రైతు పోరాటానికి సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. వడగండ్ల వా నతో పంటలు పూర్తిగా దెబ్బతింటే కనీసం జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి కా నీ.. మంత్రులైనా పట్టించుకున్నారా? అని నిలదీశారు. దెబ్బతిన్న పంటలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.