హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. విలేకరులతో చిట్‌చాట్ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్-బీజేపీ ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ వచ్చింది. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ ఎంపీ సీట్లు త్యాగం చేసింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాకు రాని బెయిల్ ఐదు నెలల్లోనే కవితకు ఎలా వచ్చిందిఅని ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రఆగ్రహం వ్యక్తంచేసింది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇదేనా మీరు మాట్లాడేది? ఒక సీఎం చేయాల్సిన ప్రకటనేనా ఇది. మీ పద్ధతేం బాగోలేదు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తాయి. పార్టీలను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటామా? అత్యున్నత న్యాయస్థానంపై గౌరవం లేదా? అని మండిపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ర్టానికి తరలించాలంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టు 29న విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం మండిపడింది. సీఎం రేవంత్‌రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంది. ఆయన (సీఎం రేవంత్‌రెడ్డి) నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ను ఈ రోజు పొద్దున పత్రికల్లో చదివాం. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయవచ్చా? ప్రభుత్వం, న్యాయస్థానం మధ్య పరస్పర గౌరవం ఉండాలన్న ప్రాథమిక నియమం కూడా తెలియదా? వ్యవస్థల మీద భిన్నాభిప్రాయాలున్నా గౌరవం ఉండాలి కదా! ఇలాంటి ప్రవర్తన, ఇంత మొండి వైఖరి ఉంటే ఎలా? కార్యనిర్వాహక, శాసనవ్యవస్థలో మేము(కోర్టులు) జోక్యం చేసుకోబోమని ఎప్పుడూ చెప్తుంటాం. అంతే గౌరవాన్ని మేము వారి నుంచి కూడా ఆశిస్తాం. సుప్రీంకోర్టు ఆదేశాలపై ధైర్యంగా వ్యాఖ్యలు చేయవచ్చని అనుకుంటున్నారా? నిన్ననే ఓ అదనపు కార్యదర్శికి నోటీసులు ఇచ్చాం. ఈ ఒక్క కారణంతో పిటిషనర్ కోరినట్టు మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు ఇవ్వొచ్చు. దేశంలోని అత్యున్నత న్యాయస్థానంపై ఆయనకు(రేవంత్‌రెడ్డికి) నమ్మ కం లేకపోతే వేరే రాష్ట్రంలో కేసు విచారణను ఎదుర్కోమనండి అని ధర్మాసనం స్పష్టంచేసిం ది. దీంతో స్పందించిన రేవంత్‌రెడ్డి తరపు న్యాయవాదులు ఈ వ్యాఖ్యలు అవాంఛనీయమని, ఆయన తరపున సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డికి కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు.