హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): తన వైఫల్యాలు బయటపడ్డప్పుడల్లా వాటిని కప్పిపుచ్చేందుకు ఏదో ఒక రాజకీయ వివాదాన్ని తెరపైకి తేవడంలో సీఎం రేవంత్‌రెడ్డి దిట్ట అని పరిశీలకులు వ్యా ఖ్యానిస్తుంటారు. తాజాగా ఢిల్లీ సాక్షిగా గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్‌కు కట్టబెట్టేందుకు రాజమార్గం వేసిన రేవంత్‌రెడ్డిపై ఇంటాబయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆ విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకు తనకు అలవాటైన రాజకీయ డైవర్షన్ డ్రామాను ఢిల్లీ వేదికగా రక్తి కట్టించారని అంటున్నారు.
సందర్భం లేకపోయినా.. మీడియాను పిలిపించుకొని చిట్‌చాట్ పేరుతో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రుల భేటీ అంశం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. బనకచర్లపై లేదా బుధవారం జరిగిన ఇరు రాష్ర్టాల సమావేశంపై మాట్లాడుతారని పాత్రికేయులంతా భావించగా.. ఆయన మాత్రం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలకే ప్రాధాన్యమిచ్చారు. ఎవరిని, ఎట్లా టార్గెట్ చేస్తే బనకచర్ల వివాదం పక్కదారి పడుతుందో గ్రహించి.. ఆ మేరకు కేటీఆర్‌పై డ్రగ్స్, గంజాయి అంటూ ఎప్పుడూ చేసే పసలేని ఆరోపణలే మళ్లీ చేశారు.
ఈ ఆరోపణలు సరిపోవని భావించిన ముఖ్యమంత్రి.. ఈసారి కొత్తగా రాజకీయంగా సంచలనం సృష్టించే ఆరోపణల కోసం ప్రయత్నించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే ఏపీ మంత్రి లోకేశ్, కేటీఆర్ రహస్యంగా కలుసుకున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇదంతా బనకచర్ల, ఢిల్లీ మీటింగ్, రేవంత్‌రెడ్డి సంతకం వంటి వివాదాల నుంచి మీడియా, ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసిన ప్రయత్నమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇరు తెలుగు రాష్ర్టాల జల వివాదాలపై బుధవారం కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్యమంత్రుల భేటీతో తెలంగాణకు తీరని నష్టం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇటు కేంద్రం, అటు ఏపీ సీఎం చంద్రబాబు ఏది చెప్తే దానికి తల ఊపేసి వచ్చారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైగా జల వివాదాలపై ఏర్పడనున్న కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడంపై నిపుణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒకవేళ కమిటీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే పరిస్థితి ఏమిటినే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తన తొందరపాటు నిర్ణయాలతో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకే కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్‌పై నిరర్థక ఆరోపణలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.