Revanth Reddy | హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రైతుల ఉచిత కరెంటుపై తప్పుడు వ్యాఖ్యలు చేసిన రేవంత్ జిత్తులమారి వేషాలు వేస్తున్నారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు 24 గంటల కరెంట్ అక్కర్లేదు, 3 గంటలు చాలు అంటూ చేసిన వ్యాఖ్యలపై తాను కట్టుబడి ఉన్నది? లేనిది? చెప్పకుండా ప్రజల దృష్టిని మళ్లించేలా కుప్పి గంతులు వేస్తున్నారని రైతులోకం భగ్గుమంటున్నది. రేవంత్ వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవటం లేదు. తమ ఉనికినే ప్రశ్నార్థకం చేసేలా ఉన్నాయంటూ యుద్ధం ప్రకటించారు. ‘3 గంటలు అని ఎట్లా అంటావు? ఇది రైతులకు ద్రోహం చేయటమే. ముందు క్షమాపణ చెప్పు’ అని బీఆర్ఎస్ కూడా డిమాండ్ చేస్తున్నది. క్షమాపణ చెప్పిన తర్వాతే జనంలోకి రావాలని మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహా రైతుసంఘాలు, రైతులు హెచ్చరిస్తున్నారు. రేవంత్ తన తప్పును ఒప్పుకోకపోగా, డైవర్షన్ పాలిట్రిక్స్ ప్లే చేస్తున్నాడని ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. రేవంత్‌రెడ్డి చేసిన 3 గంటల కరెంట్ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇంటా బయటా రేవంత్‌కు షాక్‌లు తగులుతున్నాయి. అధిష్ఠానం నుంచి, కార్యకర్త వరకు అందరూ రేవంత్‌కు తలంటుతున్నారు. పిచ్చి మాటలతో బీజేపీలో బండి సంజయ్ ఎలా పదవి కోల్పోయాడో అదేతీరుగా రేవంత్‌రెడ్డి తన అతితెలివి మాటలతో ఒంటరయ్యాడు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెసోళ్లు అన్నంత పనీ చేస్తరు
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు.. 24 గంటలు అక్కర్లేదంటూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు బ్రేకింగ్ న్యూస్‌గా రావటంతో సామాన్య రైతులు ఆందోళనకు గురయ్యారు. ‘కాంగ్రెసోళ్లు అన్నంత పనీ చేస్తరు. వీళ్లకు ఓటేయొద్దు’ అని అభిప్రాయాన్ని బాహాటంగా చెప్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలను అనుభవించిన సామాన్య రైతు స్పందనను చూస్తే ఆశ్చర్యం వేసిందని రైతు సంఘం నాయకుడొకరు ‘నమస్తే తెలంగాణ’కు చెప్పారు. నిజానికి ఆ రైతుకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ఆ రైతు నేత పేర్కొనటాన్ని బట్టి చూస్తే రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు రైతుల్లో ఎంతటి భయాందోళనలు కలిగించాయో స్పష్టం అవుతున్నది. ‘రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వటం అంటే 24 గంటల పాటు రైతులు తన మోటర్లను ఆన్ చేసుకొని పంట పొలాలకు పారించటం కాదు. ఏ సమయానికి ఎంత నీరు కావాలో తోడుకునేందకు కరెంట్‌ను అందుబాటులో ఉంచటం. అలా తెలంగాణ ప్రభుత్వం రైతుకు కరెంట్‌ను అందుబాటులో ఉంచింది’ అని రైతు సంఘం నేతలు ఉదహరిస్తున్నారు.
నాడు గురువు.. నేడు శిష్యుడు
ఓటుకు నోటు కేసు సందర్భంగా చంద్రబాబు అనుసరించిన వైఖరినే రేవంత్ అనుసరిస్తున్నాడని, అందులో భాగంగానే రేవంత్ డైవర్షన్ పాలిట్రిక్స్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు ఉదహరిస్తున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తొలినాళ్లలో చంద్రబాబు స్కెచ్‌లో భాగంగా ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు డబ్బు ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన సందర్భంలో చంద్రబాబు ఫోన్ సంభాషణ దుమారం లేపింది. ఫోన్లో మాట్లాడింది మీరే కదా? అలా ఎందుకు చేశారని మీడియా ప్రశ్నిస్తే అసలు విషయాన్ని ఒప్పుకోకుండా ‘నా ఫోన్ ట్యాప్ చేస్తారా? నా ఫోన్‌నే ట్యాప్ చేస్తారా?’ అని చంద్రబాబు బుకాయించినట్టే ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా నానాయాగీ చేస్తున్నాడని ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
అమెరికాలో తానా సభల సాక్షిగా 3 గంటల కరెంట్ చాలు అని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రజల నుంచి ప్రశ్నల కొడవళ్లు లేస్తున్నాయి. ఈ ప్రశ్నలకు జవాబేది రేవంత్?